Hydra Action Against Land Encroachments in Telangana : రాష్ట్రంలో భూ అక్రమార్జనలు బాగా పెరిగాయి. ఖాళీగా ల్యాండ్ కనిపిస్తే చాలు లటుక్కున మింగేయటమే. అది చెరువా, లేకా అన్నా తేడా ఏమీలేదు. ప్రభుత్వ భూమి అయితే జెండా పాతేయటమే. వీటికి తోడు కాపలా కాయాల్సిన అధికారులే కుమ్మక్కవడం, చూసీచూడనట్లు వ్యవహరించడం జరిగింది. చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ అండదండలున్న రాజకీయ నాయకుల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావమో నీటివనరుల ఆక్రమణలకు కారణమయ్యాయి.హైదరాబాద్
మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోనే ఆక్రమణలపై అధికారికంగా కంప్లైంట్ ఉంది. పెట్టిన కేసులు వందో, రెండొందలో కాదు ఏకంగా 928 కేసులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ 600కు పైగా కేసులు నడుస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ లేక్స్ పరిధిలోనే 590కి పైగా కేసులు ఉండగా, తర్వాతి స్థానం హైదరాబాద్ ఇరిగేషన్ సర్కిల్‌ది. ఇక్కడే కాదు చేవెళ్ల, సంగారెడ్డి ఇలా అన్ని సర్కిళ్ల పరిధిలోనూ విచ్చలవిడిగా కబ్జాలపర్వం జరిగినట్లు అధికారవర్గాలే పేర్కొంటున్నాయి.
ఆక్రమణలతో మహానగరం అల్లకల్లోలం :ఆక్రమణదారులతో, అందులోనూ బడా బడా ఆక్రమణదారులతో చెరువులు, లేక్‌లు కుంచించుకుపోవడమో, కనుమరుగు కావడమో జరుగుతుండగా, నాలాలపై ఆక్రమణలతో నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. అటు నీటివనరుల నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, ఇటు ప్రవాహమార్గాలు దెబ్బతిని చిన్నపాటి వర్షానికే మహానగరమంతా అల్లకల్లోలంగా మారుతోంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి కట్టే భవంతులకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడంపై కోర్టులు మొట్టికాయలు వేసినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చర్యలు తీసుకోవాలన్నా పట్టీపట్టనట్లు ఉండటమే కాదు, ఆక్రమణదారులకు అధికారులు సహకరించిన సందర్భాలే ఎక్కువ.
హైడ్రా రాకతో హడల్ : ఆక్రమణలపై చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టడంతో వాటికి సహకరించిన సంబంధిత శాఖల్లోని అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మరోపక్క ఆక్రమణలకు సంబంధించిన వివరాలన్నీ ఆయా శాఖలు రెడీ చేసుకుంటున్నాయి. ఎట్టకేలకు ఆక్రమణలపై సర్కార్ కన్నెర్ర చేయడమే కాదు, సెలబ్రిటీలు ఆక్రమించుకొన్న వాటిలో కొన్నింటిని నేలమట్టం చేయడంతో ఈ అంశం ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
90 Plus Water Sources Encroachment in Sangareddy : నీటిపారుదల శాఖ హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో ఉండే కబ్జాలకు సంబంధించిన కేసులే కాదు, సంగారెడ్డి జిల్లాలో 90కి పైగా చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు కేసులు నమోదయ్యాయి. ఇందులోనూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్, జిన్నారం, పటాన్‌చెరు, ఆర్‌సీ పురం మండలాల్లో 69 చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగానే నిర్ధారించింది. చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్‌లో మట్టితో పూడ్చి రోడ్లు వేయడం, ప్రహరీలు నిర్మించడం లాంటివి వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి.
అనేకచోట్ల పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడానికీ నిరాకరించినట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ ఇంజినీర్ తెలిపారు. ఆక్రమణలను తొలగించాల్సిన రెవెన్యూ యంత్రాంగం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. కొన్నిచోట్ల చెరువుల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మించినా చూసీచూడనట్లుగా మిన్నకుండి, అంతా పూర్తయ్యాక అధికారుల హడావుడి మొదలవుతుంది. నీటివనరుల ఆక్రమణ కొందరు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు కొందరు పొలిటికల్ లీడర్స్ భారీ అక్రమార్జనకు వనరులుగా మారాయి.
ప్రత్యేక కమిటీ ఉన్నా - ప్రయోజన శూన్యం : హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని కుంటలు, నీటివనరుల పరిరక్షణకు మున్సిపల్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఉన్నా, ఇందులో అన్ని శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్నా మీటింగ్‌లకు, చర్చలకే ఎక్కువగా పరిమితమైంది. ఒకవైపు కమిటీ సమావేశాలు ఆక్రమణల గురించి చర్చిస్తుండగానే, ఇంకోవైపు ఆక్రమణలు యథేచ్ఛగా జరిగిపోయినట్లు వచ్చిన కంప్లైంట్లే తేటతెల్లం చేస్తున్నాయి. 2010 ఏప్రిల్‌లో లేక్‌ల పరిరక్షణకు గత ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏ కమిషనర్ ఛైర్మన్‌గా, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు, హెచ్‌ఎండీఏ పరిధిలోని కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. అదే నెలలో జరిగిన సమావేశంలో 21 లేక్‌ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ఉస్మాన్‌సాగర్, హిమయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్‌లను గ్రీన్ బెల్ట్‌గా డెవలప్ చేయడం, మరో 11 చెరువుల్లో ఆక్రమణలను తొలగించి సరిహద్దులు ఏర్పాటు చేయడం, మిగిలిన చెరువుల్లో మురుగునీరు రాకుండా మళ్లించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 2013 ఏప్రిల్ 29న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న సర్వే నంబర్లను గుర్తించాలని సూచించింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ(1) ప్రకారం రిజిస్ట్రేషన్లు నిషేధించామని, దీని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రెండూ జరగలేదని, క్షేత్రస్థాయిలో భూ ఆక్రమణలు, నిర్మాణాలు, అమ్మకాలను బట్టి స్పష్టమవుతోంది.
నీటివనరులను ఆక్రమించి వేసే లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌కు లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ ఆర్డర్స్ జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. నీటివనరులన్నీ మ్యాపింగ్ చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను గుర్తించడానికి గత కొన్నేళ్లుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. ఇందుకోసం స్పెషల్‌గా ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఎఫ్‌టీఎల్‌ను గుర్తించడంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని కొంతకాలం పక్కనపెట్టారు. కుంటలు, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలు, ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఆక్రమణల గురించి లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాల్లో చర్చించడం తప్ప చర్యలు మాత్రం శూన్యమనే అభిప్రాయం ఉంది.
హెచ్‌ఎండీఏ పరిధిలో 617 లేక్‌ల నోటిఫికేషన్ పెండింగ్‌లోనే :2018 ఏడాది చివర జరిగిన కమిటీ సమావేశంలో 3132 లేక్‌లకు గాను కేవలం 165 లేక్‌లను మాత్రమే తుది నోటిఫై చేసినట్లు గుర్తించారు. 2019 జనవరి 31 నాటికి అన్ని లేక్‌ల తుది నోటిఫికేషన్ జరగాలని నిర్ణయించినా అది సాధ్యపడలేదు. 2021 ఏప్రిల్‌లో హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు (స్థానిక సంస్థలు) ఈ బాధ్యత అప్పగించారు. తర్వాత పురపాలక శాఖ కార్యదర్శికి ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పగించినా రిజల్ట్ లేకపోయింది. రంగారెడ్డి జిల్లాలో 618కి గాను 78 లేక్‌లు మాత్రమే తుది నోటిఫై చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 824 లేక్‌లకు గాను 429 లేక్‌లను ప్రిలిమినరీగా, 93 లేక్‌లను తుది నోటిఫై చేశారు. మెదక్ జిల్లాలో 516 లేక్‌లను సర్వే చేయగా, 122 లేక్‌లను ప్రాథమికంగా, నాలుగింటిని తుది నోటిఫై చేశారు. సంగారెడ్డిలో 457 లేక్‌లను సర్వే చేయగా, 265 ప్రిలిమినరీ, 29 తుది నోటిఫైకి నోచుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో 200కు గాను 160 లేక్‌లను ప్రాథమికంగా నోటిఫై చేయగా, ఒక్కటి కూడా తుది నోటిఫైకి నోచుకోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ 225 లేక్‌లను సర్వే చేసి, 219 లేక్‌లకు ప్రిలిమినరీ ప్రకటన ఇచ్చినా, తుది నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఇప్పటికీ 617 లేక్‌ల ప్రిలిమినరీ నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైడ్రా హడల్ - మూడో కంటికి తెలియకుండా అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి - HYDRA ENCROACHMENT DEMOLITIONS
చెరువుల కబ్జాతో ముప్పే - హైకోర్టుకు న్యాయమూర్తి లేఖ - స్వీకరించిన న్యాయస్థానం - Telangana HC on Pond Encroachments