Story Of 22 Temples In One Place :ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది. ఏ వీధిలో చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. కల్యాణులు, చాళుక్యులు, కాకతీయ రాజుల పాలనాకాలంలో నిర్మించిన పురాతన ఆలయాలు తవ్వకాలలో బయటపడ్డాయి. వాటిని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఆ ఆలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా గుళ్లు ఉన్న గ్రామాల్లోని విశేషాలపై ప్రత్యేక కథనం.
ఒకే చోట 22 మందిరాలు :దేశానికి స్వాతంత్య్రం సిద్దించక పూర్వం జహీరాబాద్ పట్టణం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతంలో మాణిక్‌ప్రభు మహేలా (గూడెం), గడిమహేలా కాలనీలు మాత్రమే ఉండేవి. ఈ ప్రదేశంలో ఏవైనా రోగాలు సోకితే ప్రజలంతా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు నాటువైద్యం కూడా చేయించుకునే వారు. ఓ దశలో కలరా, ప్లేగు పంజా విసిరి పలు కుటుంబాల్లో అందరూ మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో మొక్కుల్లో భాగంగా స్థానికులు మాణిక్‌ప్రభు మహేలాలో ఒకే చోట 22 అమ్మవారి ఆలయాలను నిర్మించడం విశేషం. ఏటా దసరా సమయంలో ఇక్కడ వేడుకలను నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో బోనాలను సమర్పిస్తారు.
దైవక్షేత్రాలకు నిలయం :మెదక్ జిల్లాలోని శివ్వంపేట దైవ క్షేత్రాలకు నిలయంగా మారింది. పదుల సంఖ్యలో చారిత్రక కట్టడాలు ఉండటం ఈ ప్రాంతం విశేషం. భవానీశంకర స్వామి, కోదండ రామస్వామి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఉమామహేశ్వర, దుర్గాభవానీ, సంకటమోచన హనుమాన్ ఆలయాలు - 4, శివాలయాలు - 4, కాలభైరవ స్వామి ఆలయంతో పాటు అమ్మవారి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కాకతీయ రాజుల కాలంలో నిర్మించినవే కావడం విశేషం. ఏ వీధిలో చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. ఇటీవల బగలాముఖి శక్తిపీఠాన్ని స్థాపించారు. శిర్డీ సాయిబాబా, దత్తాత్రేయ మహాస్వామి, ఎల్లమ్మ ఆలయాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి.