తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతి పండుగ బతుకమ్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - DUSSEHRA AND BATHUKAMMA FESTIVALS - DUSSEHRA AND BATHUKAMMA FESTIVALS

Bathukamma Festival History in Telugu: పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దంపడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. కాగా అక్టోబరు 2న బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది.

Dussehra Festival in Telangana
Bathukamma Festival (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 9:07 AM IST

Bathukamma Festival :తెలంగాణలోమహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక. ఆదిపరాశక్తిని అరవిరిసిన సుమాల్లో దర్శిస్తూ, పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక 'శక్తి ఉపాసన'గా, ఆత్మచైతన్యానికి మేల్కొలుపుగా భావిస్తారు.

శరన్నవ రాత్రులకు ఒకరోజు ముందే బతుకమ్మ :'బతికించే అమ్మ' అనే ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించటం బతుకమ్మ పండుగలో అంతరార్థం. ఆరోగ్యకర జీవనం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మను వేడుకోవటం ఆనవాయితీ. శరత్కాల నవరాత్రుల్లో సకల జనావళి జగనాత్మను పూజించి తరించాలని దేవీపురాణం ఉద్ఘాటిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో శరన్నవ రాత్రులకు ఒకరోజు ముందే అంటే భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవిల అంశగానే కాదు, శ్రీ చక్రశోభితగా, ప్రకృతికి ప్రతిరూపంగా, తమ ఇంటి ముత్తయిదువగా భావిస్తారు. ఆ సంగతులన్నీ పాటలుగా ఆలపిస్తారు. 'శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మయె ఉయ్యాలో', 'నూరునోములు నోచి ఉయ్యాలో నూరుమందిని గాంచె ఉయ్యాలో', 'జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగ వెలసె ఉయ్యాలో' అంటూ కీర్తిస్తారు. ఇలా గీతాలతో అమ్మవారిని ఆరాధించటమే కాదు, మదిలోని కష్ట సుఖాలను, పురాణ కథలు, చారిత్రక ఘట్టాలను తెలియజేస్తారు.

బతుకమ్మకు వివిధ రకాల నైవేద్యాలు :బతుకమ్మకు సమర్పించే నైవేద్యాల్లో అమ్మవారి ఇష్టాలకు తగ్గట్టుగా పులిహోర, పులగం, బెల్లపు అన్నం, పెరుగన్నం, పాయసాన్నం, నెయ్యి కలిపిన అన్నం నివేదిస్తారు. బతుకమ్మ పండుగలో లలితాదేవి ఆరాధన దాగి ఉందని ఈ నైవేద్యాల వల్ల అర్థంమవుతుంది.

బతుకమ్మను పూజిస్తూ :9 రోజుల బతుకమ్మ పండుగ మాతృత్వంలోని నవ మాసాలకు ప్రతీక. ఈ కారణంగానే ఈ పండుగను సంతాన సాఫల్యతకు సంబంధించిన వేడుక అని కూడా అంటారు. ఈ నవరాత్రుల బతుకమ్మ పాటల్లో, గర్భిణుల ఆరోగ్యం, ఆహార అలవాట్లకు సంబంధించిన సూచనలు ఉన్నాయి.ఈ 9 రోజులూ బతుకమ్మను పూజిస్తూ, దాన ధర్మాలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సత్సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

చరిత్రలో బతుకమ్మ పండుగ! :కాకతీయుల కాలంలోనూ బతుకమ్మ పండుగ వైభవంగా జరిగేదని తెలుస్తోంది. తెలంగాణలో ప్రసిద్ధమైన బతుకమ్మ పండుగను పోలిన వేడుకలు. ఓనం, అట్లతద్దె, కోలాటం, దాండియా, గొబ్బెమ్మ- ఇలా నామ, రూప భేదాలతో దేశమంతా కనిపిస్తాయి. భక్తి సామ్రాజ్యానికి బతుకమ్మ పండుగ పెట్టని కోట లాంటిది అంటే అతిశయోక్తి కాదు.

ప్రకృతికే సమర్పణ :బతుకమ్మను వివిధ రకాల పూలతో అలంకరిస్తారు. అనేక నైవేద్యాలను సమర్పిస్తారు. పూలను పేర్చటం ఓ సృజనాత్మక ప్రక్రియ. తంగేడు, బంతి, గునుగు, తీగమల్లె, గుమ్మడి, మంకెన, పోకబంతి, కనకాంబరం, గన్నేరు, సీతజడ తదితర పూలు బతుకమ్మలో కొలువదీరుతాయి. పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి, చుట్టూ దీపాలతో తీర్చిదిద్దటం సంప్రదాయం. కొందరు ఈ గౌరమ్మను బొడ్డెమ్మ అని పిలిస్తే ఇంకొందరు బతుకమ్మనే బొడ్డెమ్మగా వ్యవహరిస్తారు.

తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుకు ఆహారం బొడ్డుతాడు ద్వారా అందుతుంది. ఆ బొడ్డుతాడుకు దివ్యత్వాన్ని జోడించిన స్వరూపమే బొడ్డెమ్మగా అవతరించిందని భక్తుల విశ్వాసం. ఎవరికి వారు మొదట ఇంట్లో బతుకమ్మను పూజించి, తర్వాత తమ వీధిలో విశాల ప్రాంగణంలోకి చేరుస్తారు. అందరూ బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడతారు. చివరకు సమీప చెరువులో ప్రకృతికే సమర్పిస్తారు.

తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లు :

  • మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ముందురోజు కోసిన పూలను నీళ్లలో వేసి మరునాడు అలంకరణకు వాడటం వల్ల అలా పిలుస్తారు.
  • రెండో రోజు అటుకుల బతుకమ్మ.
  • మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.
  • నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ.
  • అయిదో రోజు అట్ల బతుకమ్మ.
  • ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి, బతుకమ్మ ఆట ఆడరు.
  • ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా ప్రసిద్ధి. సకినాల పిండిని వేపకాయల్లా చేసి నైవేద్యంగా పెట్టటం వల్ల ఆ పేరు వచ్చింది.
  • ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. దేవేరికి వెన్నతో తయారు చేసిన నువ్వుండలను నైవేద్యంగా సమర్పిస్తారు.
  • తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మహిళలంతా సాంప్రదాయ పద్ధతులతో ముస్తాబై బతుకమ్మ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఇలా అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బట్టి ఆ రోజు బతుకమ్మను పిలవటం అలవాటు. ఈ తొమ్మిది రోజులూ ముగిశాక 'పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా మల్లొచ్చె యాడాది తిరిగి రావమ్మా' అని వీడ్కోలు పలుకుతారు.

ABOUT THE AUTHOR

...view details