Srisailam Akka Mahadevi Caves : అందాల నల్లమల అడవుల్లో కృష్ణా నది ఒడ్డున అక్కమహాదేవి గుహ ఉంది. ఇక్కడికి వెళ్లే దారిలో ప్రకృతి అందాలు చూడముచ్చటగా ఉంటాయి. అధ్యాత్మిక పర్యాటకుల గమ్యస్థానాల్లో ఒకటి ఈ గుహ. దీన్ని దర్శించాలనుకుంటే శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నుంచి 16 కిలో మీటర్ల దూరం కృష్ణా నదిలో పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి రోడ్డు మార్గంలో ఈ గుహకు, అక్కడి పర్యాటక ప్రదేశాలకు వెళ్లొచ్చు. దీనికోసం అటవీ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర అటవీశాఖ రోడ్డు నిర్మించింది.
దోమలపెంట నుంచి సఫారీ ప్రారంభం :దోమలపెంట నుంచి సఫారీ ప్రారంభంఅవుతుంది. దట్టమైన నల్లమల అడవిలో వన్యప్రాణుల సందడి, పచ్చని చెట్ల అందాల మధ్య ఐదు కిలోమీటర్లు జీపులో ప్రయాణించాలి. ఆ తర్వాత ఓ అరకిలోమీటరు దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిలువెత్తు గిరుల మధ్యలో ఉండే అక్కమహాదేవి గుహ లోపలికి వెళ్లిరావచ్చు. రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని పెంచేందుకు అటవీశాఖ ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాలమడుగు, అక్కమహాదేవి గుహ ప్యాకేజీని అందుబాటులోకి తేనుంది. దీన్ని కొద్దిరోజుల్లోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇద్దరికి రూ.6,500-రూ.8,000 : అక్కమహాదేవి గుహ పర్యాటకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని రూపొందించనుంది. బస చేసేందుకు గది, టిఫిన్, భోజనం, రెండుసార్లు సఫారీ ఉంటాయి. ‘ఇద్దరికి కలిపి రూ.6,500, రూ.7,500, రూ.8,000 ఇలా మూడు రకాల టారిఫ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. గది విస్తీర్ణం, రివర్ వ్యూను బట్టి ఈ ధరలు కేటాయించబడతాయని అటవీ అధికారి ఒకరు తెలిపారు. దోమలపెంటలో హిల్‌టాప్ పక్కన ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌ను అటవీశాఖ కొత్త హంగులతో రూపొందించింది.