Srikakulam These Villages Celebrate Bhogi Differently :తెలుగింట అతిపెద్ద వేడుక సంక్రాంతి. పల్లెలన్నీ పండగ శోభతో వెలిగిపోతాయి. మూడు రోజుల పాటు జరిగే సంబరాలకు ఉపాధి, ఉద్యోగ రీత్యా దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా పురిటిగడ్డపై వాలిపోతారు. తొలిరోజు నిర్వహించే భోగి పండగ ప్రత్యేకమైంది. పిల్లలు, పెద్దలు అంతా కలిసి మంటలు వేస్తుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఈ పండగను కొన్ని గ్రామాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల అసలు మంటే వెలగదు. మరికొన్నిచోట్ల రెండురోజులు చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పాటిస్తున్న ఆ గ్రామాలేంటి ఎందుకలా చేస్తున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఈ పల్లెల్లో మంటలే వెలగవు
- జలుమూరు మండలం లింగాలవలసలో భోగి పండగ నిర్వహించరు. పూర్వం ఆరోజున సమీపంలోని కొండ నుంచి పులి చొరబడి దొరికిన వారిని ఎత్తుకెళ్లి సంహరించేదని, దాంతో పూర్వీకులంతా ఐకమత్యంతో భోగి పండగ రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల కిందట ఓ యువకుడు సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ పండగ నిర్వహించాడు. అదే రోజు అతడు మృత్యువాత పడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు.
- గార మండలం బూరవల్లిలో మంటలు వేయరు. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, ఆ కారణంగానే నాటి నుంచి గ్రామంలో భోగీ చేసుకోవడం లేదని పెద్దల మాట.
- నరసన్నపేట మండలం బసివలస, చింతువానిపేట, గోకయ్యవలస, చోడవరం, సుందరాపురం గ్రామాల్లో వేడుక చేయరు. బసివలసలో వందల ఏళ్ల క్రితం జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో భోగి పండగపై అప్పటి పెద్దలు నిషేధం విధించారని, అప్పటి నుంచి అదే సంప్రదాయం పాటిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. గోకయ్యవలసలో మంటల్లో పిల్లి పడి మరణించిందని, ఆ ఘటన అపశకునంగా భావించి వేడుకలు జరపడం లేదని పెద్దలు తెలిపారు.
సంక్రాంతి అంటేనే స్వీట్లు హాట్లు- ఘుమఘమలాడే వంటకాలతో కిటకిటలాడుతున్న మిఠాయి షాపులు
బెల్లుపడలో రెండు రోజులు :ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడలో భోగి పండగ రెండు రోజుల పాటు జరుగుతుంది. ఒక రోజు ముందే వేడుకలను ప్రారంభిస్తారు. బెల్లుపడ ఉమామహేశ్వరాలయం సమీపంలో మండపం ఎదురుగా మంటలు వేస్తుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గ్రామస్థులు పాపారావు, సంతు తెలిపారు.