Sriram Sagar Water Projects Gates Repair Actively : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిగులు జలాలు గోదావరిలోకి విడుదల చేయడానికి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 42 వరద గేట్లున్నాయి. ఒక్కో గేటు 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తు ఉన్నాయి. అన్నింటితో ఏకకాలంలో 16 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉంది. ఏటా నిర్వహణ మరమ్మతులు చేపడుతున్నా, నలభై ఏళ్లుగా పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదు.
అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నిధులు విడుదల చేయడంతో 2022 జూన్‌లో అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి మరమ్మతు పనులు ప్రారంభించారు. ఆ తర్వాత పది రోజులకే వరదలు రావడం, జలాశయం నిండడంతో పనులు నెమ్మదిగా సాగాయి. వర్షాలు తగ్గి నీటి విడుదల నిలిచాక పనులు కొనసాగాయి. 2023 జులైలోనే ప్రాజెక్టు నిండడంతో మళ్లీ పనులు నెమ్మదించాయి. నిండుగా నీరున్నప్పుడు సైతం స్టాప్ లాక్ గేట్లను దించి వరద గేట్లకు మరమ్మతులు చేపట్టారు.
ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకతో గేట్లకు స్యాండ్ బ్లాస్టింగ్ : శ్రీరామసాగర్ ప్రాజెక్టులోని 33 గేట్ల పనులు పూర్తవగా, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయి. వైస్రోప్స్, టర్న్ బక్కల్, రబ్బర్ సీల్స్ మార్చడం, గేట్లకు రంగులు వేయడం చేస్తున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకతో గేట్లకు స్యాండ్ బ్లాస్టింగ్ సైతం చేయిస్తున్నారు. గేట్లకు సింగిల్ కోటింగ్ కలర్ వేసినా అన్నింటికి చివరగా రంగులు వేయాల్సి ఉంది.
ఈ సీజన్‌లో రుతుపవనాలు తొందరగానే వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. మళ్లీ వరదలు వస్తే పనులు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. పనుల పూర్తికి మరో రెండు నెలలు సమయం పడుతుందని, వరదలు వచ్చినా పనుల పూర్తికి ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.