Special Story on Digital Arrest in Cyber Crime : సైబర్ క్రైమ్ బారిన పడ్డవారి గురించి తెలిసిన వారు ఎవరైనా ముక్కూముఖం తెలియన వాడు ఫోన్ చేస్తే భయపడి ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తారా? అనే సందేహం వస్తుంది. కొందరైతే అలా జరిగి ఉండదులే అని కొట్టిపారేస్తారు. అక్కడ వాస్తవం ఏమిటంటే సైబర్ నేరగాళ్లు బాధితుడికి కాల్ చేసి, వారు చెప్పింది వినేది తప్ప మరో పరిస్థితి కల్పించరు. బెదిరిస్తారు, కేసులంటారు, జైలు ఇలా నానారకాలుగా ఇబ్బందులకు గురిచేస్తారు. బయటే పోలీసులు ఉన్నారు, మీరు కాల్ కట్ చేస్తే వారు వచ్చి అరెస్టు చేస్తారంటూ భయపెడతారు. దీంతో బాధితుడు ఏమీ చేయలేక నేరగాళ్ల వలలో పడతారు. దీన్నే 'డిజిటల్ అరెస్టు' అంటారు.
- హైదరాబాద్ అడిక్మెట్కు చెందిన వృద్ధురాలికి గత నెలలో ముంబయి పోలీసుల పేరిట ఓ వ్యక్తి కాల్ చేశాడు. సినీ నటి శిల్పాశెట్టి దంపతులకు సంబంధించిన మనీలాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమయిందని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని బెదిరించాడు. తనని ‘డిజిటల్ అరెస్టు’ చేశామని బెదిరించాడు. అనంతరం బాధితురాలి బ్యాంకు ఖాతా, ఎఫ్‌డీలు, పీపీఎఫ్ ఖాతాల్లోని రూ.5.9 కోట్ల సొమ్మును వేరే అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నాడు.
- హైదరాబాద్ శివారు ప్రాంతం రామచంద్రాపురం భెల్ టౌన్‌షిప్ సమీపంలో నివసించే వృద్ధుడికి(80) మే నెల 19న వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, కేసు నమోదైందని బెదిరింపులకు దిగాడు. మే నెల 20 నుంచి జూన్ 20వరకు పలు విడతలుగా రూ.4.98కోట్ల సోమ్మును కాజేశారు.
- నాచారంలోని ట్రాన్స్‌కో విశ్రాంత సీఈ(75)కి జూన్ 13న ముంబయి టెలికాం శాఖ పేరిట ఫోన్ చేశారు. మీ పేరిట తీసుకున్న సిమ్‌ను వినియోగించి ఓ వ్యక్తి మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు, ఈ కేసులో మీరే నిందితులు అని బెదిరించి రూ.4.82 కోట్లు బదిలీ చేయించుకున్నాడు.
యాక్షన్ ఇలా మొదలు :బాధితులను ఎలా నమ్మిస్తారంటే ముందుగా గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ వేషధారణలో స్కైప్ లేదా వీడియో కాల్ చేస్తారు. తనను తాను పోలీస్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమయిందని చెప్తారు. ఎఫ్‌ఐఆర్ నమోదైందని చెబుతూ సదరు కాపీని వాట్సాప్‌కు పంపిస్తారు.
అందులో బాధితుడి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు, అందులో నగదు జమైనట్టు నకిలీ వివరాలు ఉంటాయి. దీంతో బాధితుడు కంగుతింటాడు. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర నేరంగ కావడంతో తప్పుక అరెస్టు అవుతారని, ఈ కేసులో బెయిల్ కూడా దొరకదని, నెలల తరబడి జైల్లో ఉండాల్సి ఉంటుందని అవతలి వ్యక్తి భయపెటతాడు. దీంతో బాధితుడు ఏమీ చేయలేక చెప్పింది చేస్తాడు.
ఒకవేళ తనకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని బాధితుడు మొరపెట్టుకుంటున్న అవతలి వ్యక్తి మాత్రం తన పంథాను మార్చుకోకుండా బెదిరిస్తూనే ఉంటాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు ఫోన్‌కాల్ బదిలీ చేస్తున్నామని చెబుతాడు, మరోవ్యక్తి కాల్లో కనెక్ట్ అవుతాడు. తాను కూడా సైబర్ క్రైమ్ ఎస్పీ లేదా ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు.