Special Story on Medaram Sammakka Sarakka Bangaram :మహా కుంభమేళగా పిలిచే మేడారం జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ వన దేవతల దర్శనానికి భక్తులు మేడారం బాటపడుతున్నారు. దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు మేడారం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారింది. వ్యయ ప్రయాసలను లెక్కచేయక భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. బంగారంగా చెప్పుకునే బెల్లాన్ని అడవి తల్లులకు కానుకగా సమర్పించుకుంటున్నారు.
వన దేవతలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో ఎత్తు బంగారం సమర్పించుకుంటే సకల శుభాలు జరుగుతాయన్నది వారి నమ్మకం. తమ ఎత్తు బంగారంతో పాటు కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, చీర సారెలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించి మనసారా తల్లులను కొలుచుకుంటున్నారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని తల్లులను వేడుకుంటున్నారు. భక్తులు కోరుకున్న కోరికలు తీరిన వేళ, తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు వస్తుండటంతో బెల్లం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
'అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి మేడారానికి వచ్చి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటాం. అనంతరం అమ్మవారి గద్దెలను దర్శించుకుంటాం. ఎటువంటి కోరికలు ఉన్నా కచ్చితంగా నెరవేరుతాయి. అందుకే ప్రతి రెండేళ్లకు కుటుంబసమేతంగా మేడారానికి వస్తాం. అమ్మవారికి బంగారం సమర్పించుకోవాలని అనుకున్న భక్తులు కచ్చితంగా సమర్పించుకుంటారు'. - భక్తులు