Special Story On Elamasa Festival : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం త్రిభాషా సంగమంగా పేరొందింది. మూడు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కనిపించేది ఇక్కడే. ఈ ప్రాంత ప్రత్యేకతను చాటే ఓ పండుగ రాష్ట్రంలోనే భిన్నంగా జరుపుకుంటారు. అదే ఎలమాస పండుగ.
ప్రతి ఏటా అమావాస్య రోజున (వార్షిక పండుగ) జరుపుకుంటారు. అమావాస్య ఉండటంతో ఈ పండుగను ఎలమాస్య పండుగ అంటుంటారు. ఈ ప్రాంతంలో రబీలో అంతా ఆరు తడి పంటలే. చేలల్లో జొన్న మొక్కలతో గుడి కడతారు. అందులో అన్ని మట్టి విగ్రహాలు తయారు చేస్తారు. అందులో లక్ష్మీదేవి, పాండవులు విగ్రహాలతో పాటు రైతులు, కాడెద్దులు, కాపాలాదారుల వంటి మట్టి విగ్రహాలు ఆకర్షణీయంగా రూపొందిస్తారు. ఎలమాస పండుగ రోజు నాటికి లక్ష్మీదేవి గర్భవతిగా ఉన్నట్లు రైతులు భావిస్తారు. కడుపులో బిడ్డను మోస్తున్న లక్ష్మీదేవిని సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాలనే ఉద్దేశంతో సీమంతం మాదిరిగా అలంకరించి పూజలు చేస్తారు.
పాటలు పాడుతూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ :చెరకు, జామ, రేగి పండ్లతో పాటు కంది, శనగ తదితర గింజలను సమర్పిస్తారు. గుడికి కొంత దూరంలో మట్టి పాత్రలో పాలు పొంగించేందుకు మంట పెట్టి వస్తారు. ఆ తర్వాత రైతు కుటుంబమంతా బంధుమిత్రులతో కలిసి చేనుకు వెళ్లేందుకు తయారవుతారు. మట్టి కుండలో అంబలి పోసి, ఆ కుండకు మంగళసూత్రం లేదా ముత్యాల హారం కడతారు. ఇదో సంప్రదాయంగా వారు భావిస్తారు. తూర్పు దిశలో పాలు పొంగితే పంటలు సమృద్ధిగా పండుతుందని భావించి, పాలు పొంగిస్తారు. మగవాళ్లు మాత్రం ఒలిగ్యో ఒలిగ్యా సాలం పాలిగ్యా అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జొన్న గుడిలోనే ఓ గొయ్యి తవ్వి అంబలి, అన్నంతో ఉన్న మట్టి కుండను మూస్తారు. పంట దిగుబడి వచ్చే సరికి మళ్లీ ఆ కుండను వెలికి తీసి దిగుబడిని అదే కుండలో నింపి ఇంటికి తీసుకురావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.