Special Story on Drawing Master Vikramraj : సమాజాన్ని తన చిత్రకళతో ప్రభావితం చేయాలని సంకల్పించాడు ఈ యువకుడు. అందుకోసం "ఐకోనోఫ్రేమ్ 2024" పేరిట హైదరాబాద్‌లో ప్రముఖు మీడియా దిగ్గజాల కళాకృతులతో ప్రదర్శన నిర్వహించాడు. ఆదర్శనీయ వ్యక్తులుగా కీర్తించబడే వారి గురించి భావితరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు విక్రమ్‌రాజ్. భవిష్యత్తులోనూ విభిన్న థీమ్‌లతో ఎగ్జిబిషన్‌లు నిర్వహించి ప్రజాచైతన్యం కోసం పాటుపడాలనే దృఢ నిశ్చయంతో సాగుతున్నాడు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాలను సృష్టించిన విక్రమ్‌రాజ్ స్వస్థలం వరంగల్ జిల్లాలోని పరకాల.
చిత్రకళలో ఉచిత శిక్షణ : కేజీ నుంచీ పీజీ వరకూ ఇతడి చదువంతా గురుకుల, ప్రభుత్వ కళాశాలల్లోనే గడిచింది. కళలపై చిన్నప్పటి నుంచే అమితాసక్తి పెంచుకున్న విక్రమ్‌రాజ్, హైదరాబాద్‌లోని జీఎన్ఎఫ్ఏ(JNAFA) విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ పూర్తిచేశాడు. ఆర్ట్స్‌లో పీజీ పూర్తిచేసిన విక్రమ్‌రాజ్‌కు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్‌గా ఉద్యోగం లభించింది. జీవితం సాఫీగా సాగిపోతున్నా భావితరాలను కళాకారులుగా తీర్చిదిద్దాలనే తపన తనని వేధించేది. అందుకే ఒక పక్క ఉద్యోగం చేస్తూనే, ఔత్సాహికులకు చిత్రకళలో ఉచిత శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు.
Icono Frame 2024 in Hyderabad :బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఆర్ట్ కోర్సుల్లో చేరేలా తోడ్పాటు అందిస్తున్నాడు. 2013 నుంచి వేలమందిని ఈ కళ వైపు నడిపించి జీవితంలో స్థిరపడేందుకు కృషి చేశాడు విక్రమ్‌రాజ్. సమాజానికి స్ఫూర్తి పంచాలనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా పెయింటింగ్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో "ఐకోనోఫ్రేమ్ 2024" ఎగ్జిబిషన్ నిర్వహించాడు. మీడియా రంగంలో ప్రముఖులుగా పేరొందిన వారి కళాకృతులను ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో సరికొత్త థీమ్‌లను ఎంచుకుని విరివిగా ప్రదర్శనలను నిర్వహిస్తానని అంటున్నాడు.
డ్రాయింగ్ మాస్టార్ కాకముందు : ప్రపంచ నలుమూలల సమాజానికి సమాచారం అందించి మానవళిని మేల్కొలిపే మాధ్యమం మీడియా అని, అందుకే ఐకాన్‌గా పరిగణించి చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశానని అంటున్నాడు విక్రమ్‌రాజ్. డ్రాయింగ్ మాస్టార్‌గా చేరకముందు కొన్నాళ్లు సినిమా, మీడియా రంగాల్లో ప్రకటనలు, మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగంలో పనిచేశాడు విక్రమ్. చిత్రకారుడుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. కాలిగ్రఫీ(Calligraphy)లోనూ పురస్కారాలు దక్కించుకున్నాడు.