ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెస్టారెంట్లలో ఫుడ్ రుచి వెనుక సీక్రెట్ ఇదేనా? - ఓ సారి ఆలోచించాల్సిందే - ADULTERATED FOOD IN TELANGANA

రెస్టారెంట్లో కల్తీ ఆహారం - తనిఖీల్లో బయటపడుతున్న ఉల్లంఘనలు

Adulterated Food in Hotels at Hyderabad
Adulterated Food in Hotels at Hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2024, 12:16 PM IST

Adulterated Food in Hotels at Hyderabad :రెస్టారెంట్లో పొంగిన పూరీ చవులూరిస్తుంది. కానీ అది ఎన్నిసార్లు కాచిన నూనెలో తయారు చేశారో తెలుసుకోలేం. దుకాణంలో రంగులు అద్ది చేసిన స్వీటు తినడానికి రుచిగానే ఉంటుంది. కానీ ఆ రంగులు క్యాన్సర్‌ కారకమని చాలా మందికి తెలియదు. విలాసవంతమైన హోటల్‌లో చికెన్‌ బిర్యానీ వేడిగానే వడ్డిస్తారు. ఫ్రిజ్‌లో దాచిన మాంసం మాత్రం తాజాది అనే గ్యారంటీ లేదు. బేకరీలో సాస్, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో నూడుల్స్, పరిశ్రమలో తయారు చేసే నమ్కీన్లు ఇలా తినుబండారాలు ప్రతి చోటా హానికారకంగా తయారవుతున్నాయి. నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వినియోగదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ఆహారం విషయంలో అవగాహన అవసరమని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి.

అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి :తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించేందుకు ఈ సంవత్సరం సెప్టెంబరులో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లతో 2 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఒకటి జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో, మరోటి ఇతర జిల్లాల్లో. ఇవి తరచూ తనిఖీలు చేపడుతున్నాయి. గత 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల తనిఖీలు నిర్వహించారు. దీంతో అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఇటీవల మెదక్‌లోని మనోహరాబాద్‌ ప్రాంతంలో ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఉత్పత్తిదారులు గడువు తీరిన మసాలాలతో చిప్స్, ఇతర నమ్కీన్లను తయారు చేస్తున్నారు.

పూరీరోల్ పసివాడి ప్రాణాన్ని చుట్టేసింది - ఇంటర్నేషనల్ స్కూల్​లో విషాదం

ఒక పేరుతో లైసెన్స్‌ తీసుకొని మరో ప్రముఖ బ్రాండ్‌ పేరుతో రిటైలర్లకు అమ్ముతున్నారు. నల్గొండలో అంతర్జాతీయంగా పేరున్న ఒక ఆహారశాలలో ఎక్కువ ఉష్ణోగ్రతతో పదే పదే కాచిన నూనెలను ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వేడి చేయని నూనెలో టీపీసీ (టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌) 15 వరకు, కాచిన నూనెలో 20 వరకు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. కానీ ఇక్కడ ఏకంగా 35 టీపీసీ దాటింది. ఇలాంటి నూనెలు ప్రమాదకరం అయిన క్యాన్సర్లకు దారితీస్తాయి. అక్టోబరులో హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లోని ఒక రెస్టారెంట్​లో మోమోస్, మయోనైజ్‌ తిని ఒక మహిళ మృతి చెందడం, 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం అందరికీ తెలిసిందే.

ఆహార పదార్థాలు అనేక రకాలుగా కల్తీ : -

  • అల్లం వెల్లుల్లి పేస్టు అధిక బరువు తూగేందుకు అందులో బంగాళా దుంప ముద్ద, లేదా అరటి బోదెలు కలుపుతున్నారు.
  • మిఠాయిల్లో హానికారక రంగులు ఉపయోగిస్తున్నారు. ఇవి 100 పీపీఎం విలువను దాటడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది.
  • బేకరీల్లో గడువు తీరిన వెనిగర్, సాస్‌, జామ్ యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు.
  • రెస్టారెంట్లలో శాకాహారం, మాంసాహారం వేరు వేరు ఫ్రీజర్లలో భద్రపరచాల్సి ఉన్నా ఒకే దానిలో నిల్వ చేస్తున్నారు.
  • పాత పప్పులకు రంగులు కలుపుతూ వంటల్లో వాడుతున్నారు.
  • కుళ్లిపోయిన కూరగాయలను అలాగే ఉపయోగిస్తున్నారు.
  • తయారీ యూనిట్లలో ఒక పేరుతో లైసెన్స్‌ తీసుకొని మరో పేరుతో లేబుల్‌ వేసి బ్రాండెడ్‌ అని మాయ చేసి విక్రయిన్నారు.
  • ప్యాకింగ్‌ పదార్థాల్లో పాడైన మసాలాలు యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు.

అలర్ట్​: మీరు ఉపయోగించే కాఫీ పొడి స్వచ్ఛమైనదేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా?

వాటిని కొనకండి :భారత ఆహార భద్రత, ప్రామాణిక సంస్థ చట్టం (FSSAI) ప్రకారం ఆహార పదార్థాల్లో నాణ్యతపై సందేహం ఉంటే నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించవచ్చు. పరీక్షలకు అయ్యే ఖర్చును వినియోగదారుడే భరించాలి. వస్తువు కొనేముందు దానిపై గడువు తేదీ, FSSAI లైసెన్స్‌ గడువు కూడా పరిశీలించాలి. చూడ్డానికి పాడైనట్టు ఉన్నా, మితిమీరిన రంగులు కనిపించినా, దుర్వాసన వస్తున్నా వాటిని కొనుగోలు చేయకండి.

ఫిర్యాదు చేయండి :ఆహార పదార్థం కల్తీ జరిగిందని గుర్తిస్తే తమకు ఫిర్యాదు చేయొచ్చని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు పెంచామని, ఉల్లంఘనులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. 10 రోజుల్లో వాళ్లు పొరపాటు సరిదిద్దుకొని మళ్లీ మాకు వివరాలు తెలపాలని అన్నారు. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌తో పాటు, రాష్ట్ర ఆహార భద్రత విభాగానికి వాట్సప్‌లో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

ఆహార కల్తీపై ఫిర్యాదులకు..

  • వాట్సప్ నంబరు - 9100105795
  • ఈమెయిల్ - fssmutg@gmail.com, foodsafetywing.ghmc@gmail.com
  • ఎక్స్ ఐడీ - x - @cfs_telangana

కంటికి కలర్​ఫుల్​గా, రుచిగా ఉందని తింటున్నారా? అసలు విషయం తెలిస్తే అంతే!

ABOUT THE AUTHOR

...view details