Animal Census in Nallamala : దేశవ్యాప్తంగా జంతు గణనకు అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి 8 రోజులపాటు నల్లమలలో వన్యప్రాణుల సమగ్ర సమాచారం సేకరించనున్నారు. గణన పక్కాగా చేపట్టేందుకు సాంకేతికతను వినియోగించనున్నారు. నంద్యాల, ఆత్మకూరు, మార్కాపురం గిద్దలూరు డివిజన్ల పరిధిలోని నల్లమల అభయారణ్యంలో గణన చేయనున్నారు. గుర్తించిన జంతువుల వివరాలను ఎకలాజికల్, డిస్టెన్స్ యాప్‌లలో నమోదు చేస్తారు.
25 రేంజ్‌లు : నల్లమల పరిధిలోని 25 రేంజ్‌లు, 250 బీట్లలో ఈ గణన నిర్వహించనున్నారు. 223 ట్రాన్షాక్టర్ లైన్స్, 438 ట్రయల్ పాత్‌లు ఏర్పాటు చేసి శోధించనున్నారు. 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఒక్కో బీట్‌లో 15 కిలోమీటర్ల చొప్పున రోజుకు 5 కిలోమీటర్ల పరిధిలో సర్వే చేస్తారు.
ఐదు విధాలుగా సర్వే :
- ట్రాక్‌మోడ్ సర్వేతోపాటు ఎమ్‌స్ట్రైబ్ సర్వే చేపట్టి వివరాలు నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో ఎకలాజికల్ యాప్ సహకారంతో సర్వే బృందం సభ్యులు జంతువుల చిత్రాలు తీసి సీసీఎఫ్‌కు పంపుతారు. మలమూత్రాలు సేకరించి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ ల్యాబ్‌కు పంపుతారు.
- వన్యప్రాణుల అనుకూల, ప్రతికూల పరిస్థితులు, నీరు, ఆహారం లభ్యత, పులుల సంఖ్య పెరుగుదలపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉందనే వాటిపై అంచనా వేస్తారు.
మూడు దశల్లో ముందుకు :
- గణన మూడు దశల్లో కొనసాగుతుంది. తొలుత రెండు రోజులు నల్లమల అడవిలో రెక్కీ నిర్వహించి జంతువులు సంచరించే ప్రాంతాలను నిర్ధారిస్తారు.
- ఆ తర్వాత మూడు రోజులు పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, రేసు కుక్కలు, ఇతర జంతువులను లెక్కించనున్నారు.
- చివరి మూడు రోజులపాటు అడవిలోని భౌగోళిక పరిస్థితులను కలుపుతూ ఒక్కో బీట్‌లో 2 కిలోమీటర్ల మేర ట్రాక్‌లైన్ ఏర్పాటు చేసి శాఖహార జంతువుల వివరాలు పరిశీలిస్తారు.
వివరాలు యాప్‌లో నమోదు చేస్తాం : నల్లమలలో పులుల గణనతో పాటు సంవత్సరానికి రెండుసార్లు ఇతర జంతువుల లెక్కింపు కూడా చేపడతామని డీఎఫ్‌వో సాయిబాబా తెలిపారు. ఈనెల 27 నుంచి జంతు గణన కొనసాగుతుందని చెప్పారు. సిబ్బంది మూడు విధాలుగా సర్వే చేసి యాప్‌లో నమోదు చేస్తారని వివరించారు. సర్వేలో గుర్తించిన అనువైన ప్రదేశాల్లో పులుల గణనకు ఉపయోగపడేలా కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
చిరుతలు ఇక్కడే అధికం- 270లో 90 మన సంరక్షణ కేంద్రంలోనే - Many Leopards Nagarjuna Sagar
పులులు, అటవీ జంతువుల మధ్య ప్రయాణం - నల్లమల అడవిలో 13 కిలోమీటర్ల రైడ్ - Thummalabailu Jungle Safari