CRDA Building Works in Amaravati : అమరావతిలో జగన్ కక్షా రాజకీయాలు, విధ్వంసక నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి. వైఎస్సార్సీపీ అస్తవ్యస్థం చేసిన సీఆర్డీఏ కార్యాలయ భవన మాస్టర్ ప్లాన్‌ను సరిదిద్ది, పనులు పూర్తిచేయాల్సి రావడం కష్టంగా మారింది. దీని వల్ల సమయం వృథా కావడమేగాక కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. దీంతో విజయవాడ నుంచి సీఆర్డీఏ కార్యాలయాన్ని శాశ్వత భవనంలోకి తరలించడానికి మరో నాలుగు నెలల సమయం పట్టేలా ఉంది.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 2014-2019 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి వద్ద సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణం చేపట్టింది. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులు, 2.42 లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం చుట్టూ 2.51 ఎకరాల్లో ఉద్యానవనం అభివృద్ధికి ప్రణాళిక వేసింది. అయితే 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి భవనం 7 అంతస్తులు శ్లాబ్ వరకూ పూర్తయ్యాయి. కానీ జగన్ వచ్చీరాగానే ఆ పనులన్నీ నిలిపేశారు. అంతటితో ఆగలేదు. ఆ కార్యాలయాన్ని సీఆర్డీఏకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకునేలా కుట్ర చేశారు.
అప్పట్లో ఏపీలో కార్యాలయం ఏర్పాటుకు అన్వేషిస్తున్న ఆర్బీఐ బృందానికి నాటి ఆర్థికశాఖ అధికారులు ఈ భవనాన్ని చూపించారు. అదృష్టవశాత్తూ ఆ ప్రతిపాదన ముందుకెళ్లలేదు. అయినప్పటికీ జగన్ కసి చల్లారలేదు. బీసీ కార్పొరేషన్ కార్యాలయాలన్నీ అందులో పెట్టేద్దామంటూ భవనం డిజైన్లు అమాంతం మార్చేశారు. మార్చిన డిజైన్ ప్రకారం 2023లో పనులను ప్రారంభించారు. ఈలోగా కూటమి ప్రభుత్వం రావడంతో వైఎస్సార్సీపీ కుట్రలకు బ్రేక్ పడింది.
CRDA Building Works Updates : అమరావతి పునర్నిర్మాణం పనులకు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. పాత ప్లాన్ ప్రకారమే పనులు పూర్తిచేయాలని గత అక్టోబర్‌లో భూమిపూజ చేశారు. ప్రణాళికకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి తిరిగి పనులను చేపట్టారు. ఫలితంగా సీఆర్డీఏపై రూ.5 కోట్ల మేర అదనపు భారం పడింది. పనులు పూర్తయ్యేందుకు మరో 4 నెలల సమయం పట్టేలా ఉంది.
జనవరిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలని భావించినా నిర్మాణం ఆలస్యం కావడంతో వాయిదా పడింది. జగన్ విధ్వంసాన్ని సరిదిద్దడానికి డబ్బుతోపాటు సమయం కూడా వృథా అవుతోందని రైతులు విమర్శిస్తున్నారు. భవనం బయటివైపు డిజైన్లు సైతం ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఖరారు చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. రాజధానిలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణాన్ని ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. ఏడు అంతస్తుల్లో మూడు సీఆర్డీఏకి, ఏడీసీతోపాటు భవిష్యత్‌లో రాజధానిలో ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు కేటాయించాక ఇంకా మిగిలితే ఏపీ రెరా, డీటీసీపీ కార్యాలయాలకు అద్దెకు ఇవ్వనున్నారు.
''జగన్ విధ్వంసాన్ని సరిదిద్దడానికి డబ్బుతోపాటు సమయం కూడా వృథా అవుతోంది. తద్వారా రూ.5 కోట్ల ప్రజాధనం వృథా అయింది. ఈ భవనాన్ని చూస్తుంటే భవనంలా లేదు, ఏదో గోడౌన్లా అనిపిస్తుంది. అంతలా జగన్ పాలనలో ఈ భవనం పూర్తిగా పాడైపోయింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ సీఆర్డీఏ భవనం పునర్ నిర్మాణం జరుగుతుందని ఆశిస్తున్నాం." -స్థానికులు
అమరావతికి కొత్త కళ - రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు
ఏపీ సీఆర్‌డీఏ పరిధి పెంపు - 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు