Girls Missing Cases in AP : అనంతపురం జిల్లాలో నెల కిందట ఓ యువతి అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ఆచూకీ కనుగొని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ యువతిపై అత్యాచారం జరిగిందని తర్వాత గుర్తించారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో యువతికి పరిచయమైనట్లు వెల్లడైంది. మరో ఘటనలో బీటెక్ చదువుతున్న ఓ యువతి ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. 20 రోజుల క్రితం వసతి గృహం నుంచి తన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పటివరకూ ఆ యువతి ఆచూకీ తెలియలేదు. సంవత్సరం క్రితం కూడా ఇలానే వెళ్లి తిరిగొచ్చింది. అలాగే అనంతపురం పట్టణంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఎటో వెళ్లిపోయింది. తన భర్త మందలించినందుకు మనస్తాపంతో ఇంటి నుంచి అదృశ్యమైంది.
ఎప్పుడు వెళ్తారో?, ఎప్పుడు వస్తారో? : ప్రతి ఏటా జిల్లాలో ఇలాంటి అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం లాంటి పట్టణాలకు విద్య, ఉపాధి కోసం అనేక మంది వలస వస్తుంటారు. ఇలా విద్య, ఉపాధి కోసం వచ్చేవారు ఉదయం వెళ్లి, మళ్లీ సాయంత్రం వారి ఇళ్లకు, వసతి గృహాలకు చేరుకుంటారు. నగరంలోని కొన్ని ప్రైవేటు హాస్టల్లలో సరైన నిఘా లేకపోవడంతో ఎవరు, ఎప్పుడు వెళ్తున్నారు? అలాగే ఎప్పుడు తిరిగి వస్తున్నారనే పర్యవేక్షణ జరగడం లేదని తెలుస్తొంది.
అలాంటి అదృశ్య కేసులే ఎక్కువ : ప్రస్తుత యువతలో ప్రేమ వివాహాలు, ఇతరత్రా కుటుంబ కలహాలతో అదృశ్యమౌతున్న వారే ఎక్కువ అని పోలీసుల విచారణలో తేలింది. నాలుగు గోడల మధ్య తలెత్తిన భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు సమస్యలను కూర్చోని పరిష్కరించుకునే అవకాశం ఉన్నా వాటిని పెద్దవిగా చేసుకుంటున్నారు. చిన్నపాటి మాటలకు మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్తున్నారు. అత్యధికంగా జిల్లా దాటి వెళ్లిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కుప్పకూలుతున్న జీవితాలు : మన అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో జీవితాలు కుప్పకూలుతున్నాయి. అప్పటి వరకూ ఏమీ తెలియని వారు సైతం ప్రేమ, పరాయి పురుషుల వ్యామోహం, తదితర కారణాలతో తమ వైవాహిక విలువలు మర్చి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టా, వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు కొత్త వ్యక్తులను పరిచయం చేస్తున్నాయి. అందులోని వారు ఎలాంటి వారో తెలియకుండానే యువతీ యువకులు, వివాహితులు అపరిచిత వ్యక్తులకు పరిచయమై దగ్గరవుతున్నారు. వారి మోజులో పడి అయినవారిని వదిలి వెళ్తున్నారు. ప్రస్తుతం అదృశ్యమైన కేసుల్లో ఇలాంటివి ఎక్కువగానే ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో బాలికల అదృశ్యం - ఎక్కువగా ఆ కారణంతోనే!
బడి ఎగ్గొట్టి బీచ్‌కు వెళ్లిన హైదరాబాద్ బాలికలు - ఎలా దొరికిపోయారంటే!