Advance of Southwest Monsoon 2024 :అంచనాల కంటే ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే కేరళ తీరం వైపు దూసుకొస్తున్నాయి. ఈ నెల 31 నాటికి భారత ప్రధాన భూభాగాన్ని కేరళ వద్ద నైరుతి తాకుకుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా, అంతకంటే ముందే అవి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తదుపరి వారం రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకే అవకాశాలున్నాయి.
నైరుతి రుతుపవనాలు ఈసారి వేగంగా విస్తరిస్తున్నాయి. భారత వాతావరణ విభాగం అంచనాల కంటే ముందుగానే రుతుపవనాల విస్తరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇవి అండమాన్ సహా హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాలు, శ్రీలంకలోని కామోరిన్ ప్రాంతాలను చుట్టేశాయని IMD స్పష్టం చేసింది. ఈ నెల 26 నాటికి ఆయా ప్రాంతాలను చేరాల్సి ఉన్నా, ముందుగానే ఇవి ఆయా ప్రాంతాల్లో విస్తరించినట్లు వెల్లడించింది. గత ఏడాది జూన్ 4 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. వాస్తవానికి అవి జూన్ 8న కేరళ తీరంలో వర్షాలు కురిపించాయి. గడచిన 25 ఏళ్లలో 2015లో మాత్రమే రుతపవనాలు అంచనాలు తప్పాయని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాల ఉత్తర కొన మాల్దీవులకు సమీపంలో ఉందని ఐఎండీ తెలిపింది.