South Central Railway Will Changes Train Timings : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి కొత్త రైల్వే పబ్లిక్ టైమ్ టేబుల్ అమలులోకి రాబోతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు, రైల్వే సర్వీసులను మెరుగుపరిచేందుకు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులుచేసినట్లు తెలిపింది.
జనవరి 1 నుంచి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వాస్తవ రైలు సమయాలను సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత రైల్వే స్టేషన్ల్లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్లో అందుబాటులో ఉంటుందని సూచించింది. సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చని తెలిపింది.
15 నిమిషాల ముందుగానే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్.. ఇక నుంచి విజయవాడ స్టేషన్‌లో 15 నిమిషాల ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్ ప్రకారం అయితే విజయవాడ స్టేషన్ నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6.15 గంటలకు బయలుదేరుతుంది. కొత్తగా వచ్చిన షెడ్యూల్ ప్రకారం 15 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. ప్రతిరోజూ విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు భారీ సంఖ్యలో ప్రయాణిస్తుంటారు.