South Central Railway Increase General Coaches : రైళ్లలో చాలా వరకు పేద, మధ్య తరగతి వర్గం వారే ప్రయాణిస్తుంటారు. వీరిలో ముఖ్యంగా జనరల్ బోగీ టికెట్ తక్కువగా ఉంటుందని పేదలు ఆ టికెట్నే కొనుక్కోని ప్రయాణిస్తుంటారు. కానీ అందులో ప్రయాణించాలంటే నరకం కంటే మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి రైలు బండికి కేవలం వెనక, ముందు కలిపి రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో వారి ప్రయాణ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఇక నుంచి జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
రైళ్లలో సామాన్య ప్రయాణికుల ఇబ్బందుల్ని తగ్గించేందుకు జనరల్ బోగీల సంఖ్యను 2 నుంచి 4కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే 2 విడతల్లో మొత్తం 31 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచామని, అతి త్వరలో మరో 9 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు వస్తాయి : హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (12702/12701), హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (22731/22732), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12707/12708), హైదరాబాద్-జైపుర్-హైదరాబాద్ (12720/12719), నాందేడ్-అమృత్‌సర్-నాందేడ్ (12715/12716), హైదరాబాద్-తాంబరం-హైదరాబాద్ (12760/12759), హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ (12728/12727), సికింద్రాబాద్-హిస్సార్-సికింద్రాబాద్(22737/22738), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12793/12794). వీటిలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ (LGB) బోగీలు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ వెల్లడించారు.