తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీ కోచ్‌లో ప్రయాణం చేసే వారికి గుడ్‌న్యూస్ - క్లీన్‌ బెడ్‌రోల్స్ అందించేందుకు మెకనైజ్డ్ లాండ్రీలు - SCR FOCUS ON PASSENGERS FACILITIES

ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించిన దక్షిణ మధ్య రైల్వే - ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి పరిశుభ్రమైన బెడ్‌రోల్స్ అందించేందుకు అత్యాధునిక యంత్రాలు

SCR Railway Focus On Passengers Facilities
SCR Railway Focus On Passengers Facilities (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 6:46 PM IST

SCR Railway Focus On Passengers Facilities :ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టిసారించింది. ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి పరిశుభ్రమైన బెడ్ రోల్స్​ను అందించేందుకు అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా మెకనైజ్డ్ లాండ్రీలను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా త్వరలోనే మరిన్ని లాండ్రీలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ద.మ రైల్వే పేర్కొంది.

క్లీన్‌ మెకనైజ్డ్‌ లాండ్రీలు ఏర్పాటు :దక్షిణ మధ్య రైల్వే నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజూ ప్రత్యేక రైళ్లతో సహా 116 ట్రైన్లలోని అన్ని ఏసీ కోచ్​లలో శుభ్రమైన బెడ్‌రోల్స్‌ సరఫరా చేస్తున్నారు. సగటున ప్రతిరోజూ 38,000 ఉన్ని దుప్పట్లు, 1,52,000 బెడ్ రోల్స్ ప్రయాణికులకు సరఫరా చేస్తున్నారు. ప్రయాణికులు ఒకసారి వినియోగించిన తర్వాత ఈ బెడ్‌రోల్స్‌ను శుభ్రపరిచడానికి, తిరిగి సరఫరా చేయడానికి ఔట్‌సోర్సింగ్‌తో సహా దక్షిణ మధ్య రైల్వే 7 ప్రదేశాలలో ప్రత్యేకంగా మెకనైజ్డ్ లాండ్రీలను ఏర్పాటు చేసింది.

నెలకు ఒకసారి క్లీన్‌ చేసే విధంగా :ఏసీ బెర్తులతో ప్రయాణించే వారికి ప్రస్తుతం బెడ్ రోల్‌లోని ప్యాకెట్లో 2 వైట్ బెడ్ షీట్‌లు, ఒక పిల్లో కవర్, ఒక ఫేస్ టవల్, ఒక ఉన్ని దుప్పటి అందజేస్తున్నారు. ఏసీ బోగీల్లో ప్రయాణించే వారి తెల్లని బెడ్​షీట్‌లను ప్రయాణికులు ఒక్కసారి ఉపయోగించిన తర్వాత శుభ్రపరుస్తారు. ఉన్ని దుప్పట్లు నెలకొకసారి ఉతుకుతారు. 2010లో ఉన్ని దుప్పట్లను 3 నెలలకు ఒకసారి శుభ్రపరిచేవారు. ప్రస్తుతం 2 నెలలకు ఒకసారి శుభ్రపరుస్తున్నారు. వీలైతే నెలకు ఒకసారి కనీసం శుభ్రం చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. నెలవారీ వాషింగ్ ఫ్రీక్వెన్సీతో, ఇప్పటికే ఉన్న దుప్పట్ల సేవా జీవితం నాలుగేళ్ల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించారు.

అందుబాటులో ఉన్న మెకనైజ్డ్ లాండ్రీలు అన్నీ కలిపి 23.5 టన్నుల కెపాసిటీతో కొనసాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ డిపార్ట్‌మెంటల్ లాండ్రీ రోజుకు 2 టన్నుల సామర్థ్యంతో, తిరుపతి బి.ఓ.ఓ.టి లాండ్రీ రోజుకు 2.5 టన్నుల కెపాసిటీతో, కాకినాడ బి.ఓ.ఓ.టి లాండ్రీ రోజుకు 4 టన్నులు, విజయవాడ బి.ఓ.ఓ.టి లాండ్రీ రోజుకు 1.5 టన్నుల, నాందేడ్ బి.ఓ.ఓ.టి లాండ్రీ రోజుకు 1.5 టన్నుల సామర్థ్యంతో, కాచిగూడ బి.ఓ.ఓ.టి లాండ్రీ రోజుకు 12 టన్నుల సామర్థ్యంతో కొనసాగుతుంది.

అందుబాటులోకి రానున్న మరిన్ని లాండ్రీలు :వీటితో పాటు దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే బీ.ఓ.ఓ.టీ లాండ్రీల వివరాలను కూడా తెలియజేసింది. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ ప్రాంతంలో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, గుంటూరు ప్రాంతంలో 10 టన్నులు సామర్థ్యంతో, కాకినాడలో 6 టన్నుల సామర్థ్యంతో, నాందేడ్, పూర్ణా ప్రాంతంలో 8 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నుల కెపాసిటీతో బీ.ఓ.ఓ.టీ లాండ్రీలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

బెడ్‌రోల్‌ల సరఫరాలో పరిశుభ్రత కొరకు దక్షిణ మధ్య రైల్వే అనేక చర్యలు చేపట్టింది. మెరుగైన నాణ్యత కోసం బిఐఎస్ స్పెసిఫికేషన్‌లతో కొత్త లెనిన్ సెట్‌లను వినియోగిస్తున్నారు. పరిశుభ్రమైన బెడ్ రోల్ సరఫరాను నిర్ధారించడానికి మెకనైజ్డ్ లాండ్రీలు ఏర్పాటు చేశారు. బెడ్ రోల్ ను ఉతకడానికి ప్రామాణిక యంత్రాలు, ప్రసిద్ధ నిర్దిష్ట రసాయనాలను ఉపయోగిస్తున్నారు. లాండ్రీ ప్రాంగణంలో వాషింగ్ కార్యకలాపాలను సీ.సీ.టీ.వి.ల ద్వారా, రైల్వే సిబ్బంది పర్యవేక్షిస్తారు.

అధికారుల తనిఖీలు :పరిశుభ్రమైన బెడ్ రోల్‌ను నిర్ధారించడానికి అధికారులు నిరంతర తనిఖీలు కూడా చేస్తుంటారు. శుభ్రపరిచిన బెడ్ రోల్ నాణ్యతను తనిఖీ చేయడానికి వైట్-మీటర్లు ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌లో, రైళ్లలో బెడ్‌రోల్‌లను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి, లోడ్ చేయడానికి, అన్‌లోడ్ చేయడానికి మెరుగైన లాజిస్టిక్స్‌ను వినియోస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోచ్‌లో ప్రయాణించే ఇతర బోనఫైడ్ ప్యాసింజర్‌లతో సమానంగా క్యాన్సిలేషన్‌కు వ్యతిరేకంగా రిజర్వేషన్ (ఆర్.ఏ.సి) ప్రయాణికులకు కూడా పూర్తి లినెన్ సెట్ అందిస్తున్నారు.

రైల్వే అడ్వాన్స్​ రిజర్వేషన్ టైమ్​ ఇకపై 60 రోజులే- టికెట్​ బుకింగ్​ రూల్స్​ ఛేంజ్​

రైల్వే ప్రయాణికుల కోసం 'సూపర్ యాప్'- అన్ని సౌకర్యాలు ఒకే చోట- ఇక నో టెన్షన్ బాస్..!

ABOUT THE AUTHOR

...view details