804 Special Trains For Diwali 2024 :దీపావళికి సొంతూళ్లకు వెళ్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే 804 ప్రత్యేక రైళ్లు నడపనుంది. గత సీజన్‌లో 626 ప్రత్యేక రైళ్లు నడపగా ఈసారి 178 సర్వీసులను పెంచినట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో బంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, దిల్లీకి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏయే ప్రాంతాల్లో నడపనున్నారంటే : సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రక్సాల్, జయపుర, హిస్సార్, గోరఖ్‌పుర్, షిర్డి, దానాపుర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చికి ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగల సమయంలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రత్యేక రైళ్లు నడిస్తున్నట్లు రైల్వే వెల్లడించింది.
అందుబాటులోకి UTS యాప్ :మధురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్ కోచ్‌లు, అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నట్లు తెలిపింది. అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల్లో ప్రయాణించే వారి కోసం యూ.టి.ఎస్. మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే కోరారు.