Tourists in Vanjangi Hills Paderu :ప్రకృతి ఒడిలో సేద తీరడం కంటే ఆహ్లాదకరమైన అనుభూతి మరొకటి ఉండదు. కానీ మనం నివసించే కాంక్రీట్ వరల్డ్‌లో అలాంటి దృశ్యాలు ఉండటమే గగనం. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భవనాలు, మేఘాలకు మసి పూసే పొగలు, రణగొణ ధ్వనులు ఇవే అలవాటయ్యాయి ఇప్పటి పట్టణవాసులకు. కానీ మనం ఉండే ఈ భూమ్మీదే స్వర్గాన్ని తలపించే ప్రదేశాలూ లేకపోలేదు.
ప్రకృతి అందాలతో, పక్షుల కిలకిల రావాలతో, ఆకాశాన్ని తాకే కొండలు, మబ్బుల్ని తలపించే స్వచ్ఛమైన పొగమంచు, చెక్కిలిని తాకే చల్లని నీటి తెంపరులు.. ఊహించుకుంటేనే ఎంతో రమణీయంగా ఉంది కదా! అదే నిజంగా మన కళ్లముందు ఉంటే! అవును ఇది నిజమే మిమ్మల్ని మేఘాల నడుమ ఉంచే చోటు మన అల్లూరి జిల్లాలోనే ఉంది.
అల్లూరి జిల్లాలోని పాడేరులో పర్యాటక ప్రాంతాల వద్ద రద్దీ నెలకొంది. ప్రముఖ పర్యాటక కేంద్రం పాడేరులోని వంజంగి కొండల్లో ప్రకృతి రమణీయమైన అద్భుత సౌందర్య దృశ్యం ఆవిష్కృతమైంది. పొగ మంచు దట్టంగా కమ్మి కొండల్లో వెండి మబ్బులు దర్శనమిచ్చాయి. కొండలకు సమాంతరంగా వచ్చిన మంచు పొగలో సూర్యోదయం పర్యాటకులను విశేషంగా ఆకర్షించింది. మంచు కురిసే వేళలో అంటూ పర్యాటకులు కొండల్లో విహరిస్తున్నారు. పొగ మంచు సొగసులను కెమెరాల్లో బంధిస్తున్నారు.
వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు - తిలకించేందుకు తరలివస్తున్న పర్యటకులు