BANGLADESH MAN RETURNS TO HOME: బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తిని 12 ఏళ్ల తర్వాత కృష్ణా జిల్లా నాగాయలంక పోలీసులు అతని కుటుంబం వద్దకు చేర్చారు. 2013లో నాగాయలంక మండలం నాచుగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన వీఆర్వో, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి వెళ్లి అతడిని విచారించగా, సదరు వ్యక్తి పేరు మహ్మద్ మోసలిమ్ ఉధీన్ (సామ్రాట్ మౌంటో బిశ్వాస్) బంగ్లాదేశ్ దేశీయుడు అని గుర్తించారు. అతడు బంగ్లాదేశ్ జాతీయుడని తెలుసుకొని అతని వద్ద భారతదేశంలోనికి రావడానికి ఏమైనా పర్మిషన్ ఉందా అని విచారణ చేశారు. అయితే అతని వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన, దేశంలోనికి అక్రమంగా చొరబడినట్లు నిర్ధారించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
పదేళ్లుగా నాగాయలంక పోలీసుల రక్షణలో: న్యాయస్థానం అతడికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ వ్యక్తిని 2015లో జైలు అధికారులు విడుదల చేశారు. శిక్ష పూర్తయిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అతడిని నాగాయలంక పోలీసుస్టేషన్‌కు పంపారు. అతని బంధువులు ఎవరో తెలియకపోవడంతో సుమారు పదేళ్లుగా నాగాయలంక పోలీసుల రక్షణలో ఉన్నాడు.
కుటుంబీకులను కలిపిన సోషల్ మీడియా: సుమారు పదేళ్లుగా అక్కడే ఉంటున్న అతడి బాగోగులను పోలీసులే చూసుకుంటూ, వారి కుటుంబసభ్యుల సమాచారం కోసం ప్రయత్నాలు చేశారు. నాగాయలంక ఎస్సై రాజేష్ బిశ్వాస్ వివరాలను ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టు చేశారు. బిశ్వాస్ ఫొటోను గుర్తించిన సదరు కుటుంబీకులు నాగాయలంక పోలీసులను సంప్రదించి తమ దేశానికి పంపడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు.
కుటుంబానికి అప్పగింత: ఎట్టకేలకు సంబంధిత అనుమతి పత్రాలు మంజూరు కావడంతో బంగ్లాదేశ్ బోర్డర్ కోస్ట్ గార్డ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సదరు బంగ్లాదేశ్ వ్యక్తిని హరిదాస్‌పూర్ చెక్‌పోస్టు వద్ద పశ్చిమ బెంగాల్ అధికారులకు అప్పగించినట్లు నాగాయలంక పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను, బంధువులను కలవడానికి ఎదురుచూస్తున్న బిశ్వాస్ వారిని చూడగానే సంతోషం వ్యక్తం చేశారని పోలీసులు పేర్కొన్నారు.
మేకలతో వెళ్లి అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు - వారం రోజులు ఎలా గడిపిందంటే!