How To Score Good Marks In Exam : విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. కానీ, రాసేటప్పుడు వారు చేసే చిన్న చిన్న పొరపాట్లే మార్కులు తగ్గేందుకు కారణమవుతున్నాయి. తద్వారా ఎగ్జామ్స్‌లో మంచి స్కోరు చేయలేక నిరాశకు గురవుతుంటారు. అందువల్ల పరీక్షలు రాసేటప్పుడు కొన్ని టెక్నిక్స్‌ను పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే పరీక్షల్లో టాప్ స్కోరు చేయాలంటే పాటించాల్సిన కొన్ని స్మార్ట్ టిప్స్ మీకోసం.
- ఎగ్జామ్ హాలులో కూర్చోగానే విద్యార్థుల్లో టెన్షన్ ఉండటం సహజమే. కానీ, క్వశ్చన్ పేపర్ చేతికి అందగానే చేయాల్సిన మొదటి పని అందులోని ప్రశ్నలను క్షుణ్నంగా చదవడం. దీనివల్ల ప్రశ్నలు స్పష్టంగా అర్థమవ్వడంతో పాటు చిన్న చిన్న తప్పులు దూరం చేసుకొనేందుకు దోహదపడుతుంది.
- మీకు బాగా తెలిసిన ప్రశ్నలేవో గుర్తించి వాటికే మొదట సమాధానాలను చకచకా రాసేయండి. తద్వారా మీలో కాన్ఫిడెన్స్(ఆత్మవిశ్వాసం) స్థాయిలు పెరగడంతో పాటు కష్టమై కఠినమైన ప్రశ్నలను ఆలోచించి సమాధానాలు రాసేందుకు తగినంత సమయం దొరుకుతుంది. అనవసరమైన ఆందోళనా తగ్గుతుంది.
- ఎగ్జామ్స్‌లో ఏ ప్రశ్నకు ఎంత వరకు సమాధానం రాస్తే సరిపోతుందనే విషయాన్ని గుర్తించండి. ఎలా మొదలు పెట్టాలి? ఏ అంశంతో ముగించాలనే అంశంపై ఒక్క నిమిషం ఆలోచించి ఆ దిశగా సమాధానాలు రాస్తే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు. రాసేది స్పష్టంగా ఉండేవిధంగా చూసుకోండి.
- ఉత్తమ ఫలితాల కోసం చక్కని చేతిరాత, హెడ్డింగులు సరిగా పెట్టడం, బుల్లెట్ పాయింట్లును ఇవ్వండి. కొన్ని సంక్లిష్టమైన అంశాలను వివరించేందుకు రేఖాచిత్రాలు, చార్ట్‌లను గీయడం ద్వారా మీ జవాబు పత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. తద్వారా పరీక్ష పేపర్లు దిద్దేవారికి మీపట్ల మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
- ఒత్తిడిలో సైతం ప్రశాంతంగా ఉండగలగడాన్ని అలవాటుచేసుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక్కో సమాధానాన్ని రివ్యూ చేసుకోండి. తద్వారా మీరు రాసిన ఆన్సర్ కచ్చితంగా ఉందా? ప్రశ్నలకు తగినట్లుగానే సమాధానం రాశారా? లేదా? ఇంకా ఏమైనా తప్పులుంటే చెక్ చేసి సరిదిద్దుకొనేందుకు అవకాశం ఉంటుంది.