తెలంగాణ

telangana

ETV Bharat / state

SLBC ప్రమాద ఘటన - రెస్క్యూ టీమ్​కు సవాల్​ విసురుతున్న 'మడుగు' - SLBC TUNNEL ISSUE

సొరంగంలో ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లడం పెద్ద సవాల్‌ - ఇంజినీరింగ్‌ వర్గాలను కలవర పెడుతోన్న టన్నెల్‌ ఘటన - పెద్ద ఎత్తున చేరుకుంటున్న నీటిని తోడివేయటమూ సమస్యే

Engineers Facing Problems in SLBC Tunnel
Engineers Facing Problems in SLBC Tunnel (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 7:14 AM IST

Updated : Feb 24, 2025, 7:38 AM IST

Engineers Facing Problems in SLBC Tunnel :ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాద ఘటన స్థలానికి వెళ్లడం పెద్ద సవాల్‌గా మారింది. అక్కడ జరిగిన ఘటన ఇంజినీరింగ్‌ వర్గాలను కలవరపెడుతోంది. పెద్ద ఎత్తున చేరుకుంటున్న నీటిని తోడివేయటం సమస్యగా మారటంతో పాటు మట్టి, బురదను తొలగించడం రెస్య్కూ బృందాలకు క్లిష్టమైన పనిగానే చెప్పవచ్చు. ప్రమాద దాటికి సొరంగంలో ఉన్న వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలోకి వెళ్లడం నీరు, బురద, మట్టిని తొలగించడం సవాల్‌గా మారితే అంతకన్నా అత్యంత క్లిష్టమైన దశ మరొకటి ఉండటం నిపుణులను, ఇంజినీరింగ్ వర్గాలను కలవర పెడుతోంది. ప్రమాదం జరిగిన చోట 15 అడుగుల లోతులో భారీ మడుగు (గుంత) ఉన్నట్టుగా వారు అనుమానిస్తున్నారు. అక్కడ ఒక్కొక్కటి 4 మీటర్లు వెడల్పుగా ఉండే ఏడు సెగ్మెంట్లు కూలిపోయాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉండగా పరిస్థితులను అంచనా వేయడం కూడా సవాల్‌గా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనాస్థలికి వెళ్లేందుకు పెద్ద సవాల్‌ - సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం (ETV Bharat)

రెండు ముక్కలైన సిమెంట్ సెగ్మెంట్లు : శ్రీశైలం జలాశయం వైపు నుంచి సరిగ్గా 13 కిలోమీటర్ల మైలురాయి వద్ద టన్నెల్ బోర్ యంత్రం భూగర్భాన్ని తొలుస్తోంది. ఈ భారీ యంత్రం 10 మీటర్ల వృత్తాకారంతో రోజుకు 4.5 మీటర్ల దూరాన్ని తొలిచి ఆ మట్టి, రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా వెలుపలకి పంపుతోంది. యంత్రం తొలుస్తున్న ప్రాంతం వృత్తాకారంలో ఉండగా కింది భాగంలో సిమెంట్ సెగ్మెంట్లు, కాంక్రీటు వేసి చదునుగా ఉంటుంది. దానిపై ఎప్పటికప్పుడు రైలు పట్టాలను నిర్మిస్తూ వెళ్తుంటారు. అయితే భూమిని తొలిచే గుండ్రని యంత్రం, దానిని తిప్పే యంత్రం మధ్య దాదాపు 18 మీటర్ల దూరం ఉండగా ఈ మధ్యలో దిగువ భాగంలో ఉన్న 15 అడుగుల లోతులో నిపుణులు, కార్మికులు పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే పై కప్పు నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు, మెత్తటి బురద, మట్టి కుప్పగా పడ్డాయి. వాటి ఒత్తిడి ప్రభావం ఎంతగా ఉందంటే తొమ్మిది టన్నుల బరువును మోయగలిగిన సిమెంట్ సెగ్మెంట్లు కూడా రెండుగా ముక్కలయ్యాయి.

రైలు ద్వారా రాకపోకలు :బోర్ యంత్రాన్ని తిప్పుతూ భూమిని తొలిచే బోర్ యంత్రాన్ని అనుసంధానిస్తూ వెనుక భాగంలో ఉన్న ఆపరేటర్, పరికరాల భాగాలు భూమిలోనికి వంగిపోయాయి. దీంతో సొరంగంలోన ఉన్న బురదను, మడుగులో ఉన్న మట్టి, వ్యర్థాలను తొలగించి సొరంగం బయటికి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తం అవుతోంది. టన్నెల్‌ బోర్‌ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం లోపల వ్యవస్థ అంతా స్తంభించడంతో కన్వేయర్ బెల్ట్ నడపడం సాధ్యం కాదు. సొరంగం బయటి నుంచి లోనికి చిన్నపాటి లోకో పైలెట్ రైలు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్గంలోనే బురద, మట్టి, వ్యర్థాలను బయటికి తీసుకొచ్చి పడేయాలి. అప్పుడుగానీ నిర్మాణ భాగాలు, మట్టి లాంటివి తొలిగి స్పష్టత ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సొరంగం పనుల్లో సుమారు 450 మంది పని చేస్తున్నారు. వీరిలో 150 మంది మాత్రమే స్థానికులు కాగా, మిగిలిన వారంతా ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, కశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల వారే. మొత్తం మూడు షిఫ్టులో పనులు జరుగుతుండగా ఒక్కో షిప్ట్‌లో 150 మంది సొరంగంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. టన్నెల్‌ బోర్ మిషన్ వద్ద నిత్యం కనీసం 40 మంది వరకు పని చేస్తున్నారు. 15 మంది కార్మికులు సెగ్మెంట్లు అమర్చేందుకు 15 అడుగుల దిగువలో ఉంటారు. ఈ ప్రాంతంలో పని చేస్తున్నవారంతా నైపుణ్య కార్మికులు కావడం గమనార్హం.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటన - పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎస్​ఎల్​బీసీ సొరంగ ప్రమాదం - 12 కి.మీ వరకే లోపలికి వెళ్లవచ్చు, ఆ తర్వాత కష్టమే!

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో సహాయక చర్యలు - 13.5 కి.మీ వరకు వెళ్లిన రెస్క్యూ టీం

Last Updated : Feb 24, 2025, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details