TASK Skill Training Program :ఏటా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో ఉద్యోగ మేళాలకు హాజరవుతున్నారు. సరైన ఉద్యోగ నైపుణ్యాలు లేక సత్తా చాటలేకపోతున్నారు. డిగ్రీ, పీజీలు చదివి ఉద్యోగాలు వస్తాయో, రావో అనే సందిగ్ధంలో ఉండే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ - (టాస్క్) కృషి చేస్తోంది. గతంలో హైదరాబాద్‌లోనే టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించే వారు.
బేసిక్ ఐటీ, సాఫ్ట్ స్కిల్స్‌పై తర్ఫీదు :ప్రస్తుతం నల్గొండ ఐటీ టవర్‌లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. నిపుణులైన శిక్షకులు విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ ఐటీ స్కిల్స్ వంటి వాటిపై తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ మేళాను సైతం నిర్వహించి కొలువులు సాధించేలా కృషి చేస్తున్నారు. విద్యార్థుల పాలిట ఓ వరంలా మారింది టాస్క్.
Students On TASK Training :ఉద్యోగాలు సాధించాలంటే మార్కులు ఒక్కటే కొలమానం కాదు. దానికి తోడు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన తాము, ప్రస్తుతం టాస్క్ శిక్షణలో పాల్గొంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు హాజరయ్యే విధానం, అక్కడ ఎలా వ్యవహరించాలి? అనే అంశాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు.