Momos Case Latest Update : ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బిహార్ నుంచి వచ్చిన అల్మాస్ అనే వ్యక్తి చింతల్ బస్తీలో ఉంటూ మోమోస్ తయారు చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గత నెల శుక్రవారం 25న రేష్మా బేగం అనే మహిళ సింగడకుంటలోని వెజిటబుల్ మార్కెట్లో మోమోస్ కొనుగోలు చేసి తినగా, మూడు రోజుల తర్వాత మృతి చెందారు.
అక్టోబర్ 25న కుమార్తెను వెంట తీసుకువెళ్లిన రేష్మ బేగం అక్కడే వినియోగిస్తున్న మోమోస్ కొని ఇంటికి తీసుకువెళ్లారు. తన కుమార్తెలతో కలిసి వాటిని తిన్నారు. తర్వాతి రోజు నుంచి వారంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. రెండో రోజు రేష్మ బేగం నోటి నుంచి నురగరావటం గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేష్మ బేగం మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మృతురాలి సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు మోమోస్ విక్రయించిన వారిపై ఫిర్యాదు చేశాడు. ఘటనను దర్యాప్తు చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.