తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్ - కీలక ఆధారాలు సిట్ చేతికి! - Telangana Phone Tapping Case Update

SIT Technical Evidence on Tapping Case : తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్యాపింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చిన కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ నుంచి యాక్సెస్‌లాగ్స్‌, సెర్చ్‌లాగ్స్‌ వివరాలను సిట్ సేకరించింది. మరోవైపు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ (డీవోటీ)కి సైతం నోటీసులు జారీ చేసిన దర్యాప్తు బృందం వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

Telangana Phone Tapping Case Updates
Telangana Phone Tapping Case Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 8:35 AM IST

TG Phone Tapping Case Updates :ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రోజుకో మలుపులు తిరుగుతోంది.స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ కార్యాలయంలో సిట్‌ సోదాలు చేసింది. ఈ క్రమంలోనే 3 సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లతోపాటు 5 మాక్‌ మినీ డివైజ్‌లను జప్తు చేసింది.

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ సంస్థే సమకూర్చింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన యాక్సెస్‌ లాగ్స్, సెర్చ్‌ లాగ్స్‌ కోసం సంస్థ డైరెక్టర్‌ బూసి పాల్‌రవికుమార్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఆయన నుంచి సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.

Phone Tapping Case Investigation Updates : బూసి పాల్‌రవికుమార్‌తో మేజిస్ట్రేట్‌ ముందు 160 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇప్పించింది. ఆ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ రాగి అనంతచారి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఓలేటి సీతారామశ్రీనివాస్‌ల నుంచి సైతం వాంగ్మూలాలను సిట్ సేకరించింది. మరోవైపు ల్యాబ్స్‌లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించి వాటిని విశ్లేషించే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిమగ్నమైంది.

టెలికాం కంపెనీలకు నోటీసులు : సాధారణంగా సంఘవిద్రోహ శక్తులు, కరడుగట్టిన నేరస్థుల ఫోన్లను ట్యాప్‌ చేసేందుకు మాత్రమే టెలికాం కంపెనీలు అనుమతి ఇస్తుంటాయి. అందుకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం తప్పనిసరి. అయితే ప్రభాకర్‌రావు బృందం చట్టవిరుద్ధంగా బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో భాగంగా సాంకేతిక ఆధారాల సేకరణకు టెలికాం కంపెనీల నోడల్‌ అధికారులకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ (డీవోటీ)కి సైతం నోటీసులు జారీ చేసింది. వారి నుంచి కీలక సమాచారం లభ్యమైనట్లు సమాచారం.

పోలీసుల వాంగ్మూలాలతో : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత సంవత్సరం ఆగస్టు నుంచి నవంబర్ చివరి నాటికి సుమారు 1200 సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు సిట్ ఇప్పటికే నిర్ధారించింది. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, కీలక నిందితుడు ప్రణీత్‌రావు ఆదేశాలతో తాను 60-70 మంది ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు దర్యాప్తు బృందానికి ఓ సీఐ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. అందులో సిద్దిపేటలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన చక్రధర్‌గౌడ్‌తోపాటు విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌ దాసరి భూమయ్య తదితరుల సెల్‌ఫోన్‌ సంభాషణలను విన్నట్లు వెల్లడించారు. అలానే ఎస్‌ఐబీతోపాటు టాస్క్‌ఫోర్స్‌ల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బంది పలువురు ప్రభాకర్‌రావు బృందం నిర్వాకాలపై వాంగ్మూలాలు ఇస్తుండటంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.

ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు - పోలీసులే సాక్షులు, వారి వాంగ్మూలాలే ఆధారాలు

తెలంగాణ ఫోన్​ ట్యాపింగ్​ కేసు - ఎన్నికల సమయంలో దొరికిన సొమ్మెంత?.. దోచినదెంత? - TELANGANA PHONE TAPPING CASE UPDATE

ABOUT THE AUTHOR

...view details