SIB Ex DSP Praneeth Rao Case Update : ఫోన్‌టాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను, సవాల్ చేస్తూ డీఎస్పీ ప్రణీత్ రావు తరఫు న్యాయవాది, హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా, కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్ రావు తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
కస్టడీ సమయంలో అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ఆయన పిటిషన్‌లో తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. దర్యాప్తులోని అంశాలను అధికారులు మీడియాకు లీక్ చేస్తున్నారని, వాటిని ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు.
రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని, బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదన్నారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని, ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు కోరారు. ప్రణీత్‌రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారించిన పోలీసులు, కీలక సమాచారాన్ని సేకరించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను విచారించిన పోలీసులు, ఎవరూ లోనికి రాకుండా, మీడియా కంటపడకుండా గేట్లు మూసి వేశారు. ఎస్‌ఐబీలో అతనితో పాటు పని చేసిన ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు, వారి వాంగ్మూలం నమోదు చేశారు.