Telangana Rains Today 2024 :రెమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఈదురుగాలులు, రాళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులకు నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరులో జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. దీంతో గోడ పక్కనే ఉన్న యజమాని మల్లేశ్, అతని పదేళ్ల కుమార్తె సహా అక్కడ పని చేసే మరో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు తెలకపల్లి మండలం కేంద్రంలో లింగాల రోడ్డులో పిడుగుపాటుకు గురై 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు బిజినెపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో కూడా పిడుగుపాటుకు మరో వ్యక్తి చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంతటి చౌరస్తాలో కారులో కూర్చున్న వేణుగోపాల్‌పై పక్కనే ఉన్న రేకుల షెడ్డు కూలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.