Brutal Murder Of Woman In Shadnagar :రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కేశంపేట మండలం వేములనర్వ గ్రామ శివారులోని నంబయ్యగుట్ట వద్ద మంగళవారం ఓ గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, 36 గంటల్లో హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం :కేశంపేట మండలం బోధనపల్లి గ్రామానికి చెందిన వెంకటాపురం పార్వతమ్మ రెండు రోజుల క్రితం వేముల నర్వ గ్రామ శివారులోని శివ నంబయ్య గుట్ట చెట్ల పొదల్లో కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో పోలీసులకు లభ్యమైంది. భర్త చనిపోవడంతో పార్వతమ్మ ఒంటరిగా ఉంటూ వీధి నాటకాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. తనకున్న భూమిని ఇటీవల విక్రయించి కందుకూరు వద్ద ఒక ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు కొంత బంగారం కొనుగోలు చేసి కొంత నగదును తన వద్ద ఉంచుకుంది.
పార్వతమ్మకు కొంత కాలంగా పరిచయమున్న ఫరూక్నగర్ మండలం మధురాపురం గ్రామానికి చెందిన కుందేళ్ల అంజమ్మ, కేశంపేట మండలం పోమాలపల్లి గ్రామానికి చెందిన పెబ్బే యాదయ్య వీధి నాటకాలకు సహకరిస్తూ ఆత్మీయంగా ఉంటున్నారు. పార్వతమ్మను రూ.50,000 కావాలని ఇద్దరు నిందితులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న విందు చేసుకుందామని ఇరువురు నిందితులు పార్వతమ్మను గ్రామంలోని నంబయ్య గుట్టకు పిలిచారు. అక్కడ మందు సేవించిన అనంతరం టవల్‌తో పార్వతమ్మ గొంతుకు చుట్టి చంపేశారు. అనంతరం ఇద్దరూ మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు.