Seven Years Boy Died in Fire Accident at Home :యూకేజీ చదువుతున్న ఓ బాలుడు దసరా సెలవులు కావడంతో ఇంట్లో హాయిగా నిద్రిస్తున్నాడు. తల్లి ఆ సమయంలో పని మీద కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లింది. ఈ క్రమంలో కలత లేని నిద్రపోతున్న ఆ బాలుడిని విధి పగబట్టి అగ్నిప్రమాద రూపంలో బలి తీసుకుంది. తన చుట్టూ మంటలు వ్యాపించగా బయటకు వచ్చేందుకు ఆ బాలుడు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మంటల వల్ల కమ్ముకున్న పొగ ఆ చిన్నారని బలి తీసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో చిన్నారి కుటుంబసభ్యలు తీవ్ర ఆవేదనకు గురికాగా గ్రామస్థులను సైతం కలిచివేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అగ్గిడి రాజు, అనిత దంపతులకు కుమార్తె, కుమారుడు సాయికుమార్(7) సంతానం. వారు రోజు కూలీ పని చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. పరదాలు కూడా అద్దెకు ఇస్తారు. శుక్రవారం సాయంత్రం సమయంలో సాయికుమార్ ఇంట్లో పడుకుని ఉండగా తల్లి అనిత కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి కరెంట్ సరఫరా అయ్యే తీగ వదులుగా ఉండడంతో ఆది కాస్త గాలికి ఊగి నిప్పు రవ్వలు చెలరేగాయి. నిప్పులు రవ్వలు ఇంటికి ముందు ఉన్న పరదాలపై పడటంతో మంటలు అంటుకున్నాయి. ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న పరదాలుకు కూడా నిప్పు అంటుకుంది.