Inter Students Committed Suicide After Failing Exam 2024 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం వెల్లడించింది. అయితే విద్యాశాఖ మాత్రం ముందు నుంచే ఒక విషయంపై విద్యార్థులను హెచ్చరిస్తోంది. ఒకవేళ ఫెయిల్ అయినా, మనస్తాపంతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. కానీ వారి సూచన వృథా అయింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచిపోయారు.
- మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన విద్యార్థి(16) మొదటి ఏడాది ఎంపీసీ చదువుతున్నాడు. ఫలితాలను చూసుకుంటే నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాలేదని తెలిసింది. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
- మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలానికి చెందిన విద్యార్థిని మొదటి ఏడాదిలో ఎంపీసీ చదువుతోంది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్రమనస్తాపానికి గురై, సెల్‌ఫోన్ సిగ్నల్ రావడం లేదని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి పై అంతస్తులోకి వెళ్లింది. ఎంతకీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు పై అంతస్తుకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
- మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన విద్యార్థిని(16) సీఈసీ మొదటి ఏడాది చదువుతోంది. ఒక సబ్జెట్ ఎకనామిక్స్‌లో ఫెయిల్ కావడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
- ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఒక విద్యార్థిని(17) మొదటి ఏడాదిలో గణితం ఫెయిల్ అయింది. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కుమార్తె ఫెయిల్ అయినట్లు తెలిసి ఫర్వాలేదులే అని ధైర్యం చెప్పానని కానీ ఇలా చేస్తుందనుకోలేదని తండ్రి వాపోయారు.
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన విద్యార్థిని(17) బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బోటనీలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేరని చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
- సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పరిధి కొల్లూరులో ఉంటున్న విద్యార్థి(17) ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశాడు. ఫలితాలు చూసుకుని చెరువు గట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఉరేసుకుని, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
- రంగారెడ్డి జిల్లా హైదర్‌గూడలో నివాసం ఉండే విద్యార్థిని(16) ఎంపీసీ మొదటి సంవత్సరం ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. మనోవేదనకు గురైన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా తమ నూరేళ్ల జీవితకాలాన్ని ఇలా మనస్తాపం చెంది అర్దాంతరంగా ముగించుకుంటున్నారు.
- భద్రాచలంలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని గణితంలో ఫెయిల్ అయింది. అయితే గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఈ పేపర్‌నే ఫెయిల్ కావడంతో మళ్లీ పరీక్ష రాసింది. అయితే ఇప్పుడు కూడా పరీక్షలో పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.