Huge Rush in Secunderabad Railway Station : బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. నవరాత్రి ఉత్సవాలు, పండుగ సెలవుల వేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 644 ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. ఈ రైళ్లు ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, తిరుపతి రైల్వేస్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 170, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లను నడిపించనున్నారు. మరో 185 రైళ్లు పాసింగ్ త్రూ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఈ రూట్లలో దసరా స్పెషల్ ట్రైన్స్
- సికింద్రాబాద్-కాకినాడ
- సికింద్రాబాద్-తిరుపతి
- కాచిగూడ-నాగర్ సోల్
- సికింద్రాబాద్-మద్లాటౌన్
- సికింద్రాబాద్-సుబేదార్ గంజ్
- హైదరాబాద్-గోరక్‌పూర్
- మహబూబ్ నగర్-గోరఖ్‌పూర్
- సికింద్రాబాద్-దానాపూర్
- సికింద్రాబాద్-రక్సాల్,
- సికింద్రాబాద్-అగర్తాల
- సికింద్రాబాద్-నిజాముద్దీన్
- సికింద్రాబాద్-బెర్హంపూర్
- సికింద్రాబాద్- విశాఖపట్టణం
- సికింద్రాబాద్-సంత్రగచ్చి
- తిరుపతి-మచిలీపట్నం
- తిరుపతి-అకోలా
- తిరుపతి-పూర్ణ
- తిరుపతి-హిసర్
- నాందేడ్-ఎరోడ్
- జాల్నా-చప్రా
- నాందేడ్-పన్వేల్
- తిరుపతి-షిర్డీ
- నాందేడ్-బేర్హంపూర్
- చెన్నయ్-షాలీమర్
- దానాపూర్-బెంగళూరు
- కొచ్చివెలి-నిజాముద్దీన్
- కోయంబత్తూర్-జోద్పూర్
- మదురై-ఓకా
తదితర ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రధాన స్టేషన్లలో పెరిగిన రద్దీ : పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్లు చాంతాడంతా పెరిగిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో పేరుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకూ చోటు ఉండని పరిస్థితి ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ప్రయాణికులు కనీసం బోగీల్లోకి వెళ్లే పరిస్థితి ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.