తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇళ్లు, ఉన్నోళ్లు ప్రభుత్వ పథకాలకు ఎలా అర్హులు అవుతారు' - రెండోరోజు గ్రామసభల్లో రసాభాస - SECOND DAY GRAMA SABHA IN TELANGANA

రెండోరోజు అక్కడక్కడ ఆందోళనలు మినహా ప్రశాంతంగా ముగిసిన సభలు - కొత్తగా 10 లక్షల 9వేల 131 దరఖాస్తులు

GRAMA SABHA IN TELANGANA
Second Day Grama Sabha In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 7:23 AM IST

Grama Sabha in Telangana: నాలుగు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభల్లో రెండో రోజు ‌అక్కడక్కడ ఆందోళనలు మినహాయించి ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు 60శాతం పూర్తైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం వరకు 9,844 గ్రామాల్లో విజయవంతంగా సభలు నిర్వహించినట్లు తెలిపింది. గ్రామ, వార్డు సభల్లో కొత్తగా 10,09,131 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో రోజు 3,608 గ్రామ, 1,055 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీల్లో 12,914 గ్రామ సభలు, పట్టణాల్లో 3,484 వార్డు సభలు నిర్వహించాల్సి ఉంది.

రెండోరోజు జరుగుతున్న గ్రామ, వార్డు సభలు : రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు గ్రామ, వార్డు సభలు అడపాదడపా గొడవలు మినహాయించి ప్రశాంతంగానే ముగిశాయి. నారాయణపేట జిల్లా కాచ్వార్‌ గ్రామసభలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో నూతనంగా 150 పడకల ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

గ్రామసభలో తీవ్ర రసాభాస : నాగర్​కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ గ్రామసభలో తీవ్ర రసాభాస జరిగింది. అర్హులైన ఏ ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేర్లు ఎంపిక చేయలేదంటూ అధికారులతో గ్రామస్తులు వాదించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో గ్రామసభ పోలీస్ పహారా మధ్య నిర్వహించారని మాజీ ఎమ్మేల్యే సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం పేదలను విస్మరించిందని 76వ గణతంత్ర దినోత్సవం రోజు నాలుగు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇల్లందులో రూ. 40 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అధికారులను నిలదీసిన గ్రామస్తులు: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరుగోములలో ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఎలా ఇస్తారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అనంతారంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. సంక్షేమ పథకాలకి సంబంధించి లబ్దిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో జాబితాలో పేరు లేకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు.

భూములు, ఇళ్లు ఉన్నోళ్లు ప్రభుత్వ పథకాలకు ఎలా అర్హులవుతారని నిలదీశారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు వస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నర్సాపూర్‌ గ్రామసభలో పాల్గొన్న ఆయన ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని 19వ వార్డులో వార్డు సభ ప్రశాంతంగా జరిగింది. లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు దరఖాస్తులు నింపేందుకు స్థానిక యువత సాయపడ్డారు.

బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తోంది: పథకాల లబ్ధిదారులను ప్రజాస్వామ్యంగా గుర్తిస్తుంటే బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. గతంలో ఫాంహౌజ్‌లు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారని తమ ప్రభుత్వం ప్రజల మధ్యే గ్రామాల్లో ఎంపిక చేస్తోందన్నారు. అర్హత ఉన్న ఒక్కరూ నష్టపోవద్దన్న ఉద్దేశంతో గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అర్హులైన అందరికీ అందుతాయని ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

రాజధానిలో రేషన్‌కార్డుల మంజూరులో జాప్యం - జనవరి 26న పంపిణీ లేనట్లేనా?

'జాబితాలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు ఎందుకు లేవు' - గ్రామసభల్లో అధికారులకు ప్రశ్నలు

ABOUT THE AUTHOR

...view details