Seasonal Diseases in Nizamabad : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి.వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పుమంటున్నాయి. అప్పుడప్పుడూ వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి. మలేరియా, డయేరియాతో పాటు డెంగీ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగులసంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు.
పెరుగుతున్న డెంగీ కేసులు:నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం 2వేలకు పైగా ఓపీ నమోదవుతోంది. అందులో ఎక్కువ భాగం వైరల్ జ్వరాలే ఉంటున్నాయి. గత ఆరు నెలల్లోనే 90కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాలతో డయేరియా రోగులు పెరుగుతుండగా ఈగలు, దోమల కారణంగా మిగతా వ్యాధుల వ్యాప్తి జరుగుతోంది. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది.