ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై నీటిలోనూ ఎగరొచ్చు - రాష్ట్రంలో ఏడు ప్రాంతాలలో సర్వీసులు

స్కై మీట్స్‌ సీ’ కార్యక్రమంలో భాగంగా సీప్లేన్‌ సర్వీసుకి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం

Sea_Plane_Launch
Sea Plane Launch (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 10:55 PM IST

Sea Plane Launch by CM Chandrababu: నింగి, నీరును ఏకం చేస్తూ సాగే సరికొత్త ప్రయాణ అనుభూతిని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీ ప్లేన్ పర్యాటకానికి ఆరంభ ఘటంలో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకూ సీఎం స్వయంగా ప్రయాణిస్తారు. ఈ ప్రాజెక్టును సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే, పచ్చని కొండల ప్రకృతి సోయగాలు, జల మార్గం, నగరాల్లోని ఆకాశ హార్మ్యాలు ఇవన్నీ తిలకిస్తూ సాగే గగన విహార అనుభూతి ప్రజలకు దక్కనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కై మీట్స్‌ సీ’ కార్యక్రమంలో భాగంగా సీప్లేన్‌ సర్వీసును ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకూ లాంఛనంగా ప్రారంభించి స్వయంగా ప్రయాణించనున్నారు. దేశంలో మొదటి సారి పర్యాటకంగా ‘సీ ప్లేన్‌’ అరుదైన విహారానికి రాష్ట్రం వేదిక కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ తొలి ప్రయాణంలో పాల్గొననున్నారు. 14 మంది ప్రయాణించేందుకు వీలుండే ఈ విమానం ట్రైల్‌రన్‌ విజయవంతమైంది.

పర్యాటక రంగంలో మరో అద్భుతం - విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్​

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు: కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. విమానయాన రంగానికి సంబంధిత పరిశ్రమలను పబ్లిక్‌ - ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రోత్సహించడంతో దేశ విమానయాన రంగంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీ ప్లేన్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో ప్రత్యేకతలు, వినూత్న అనుభూతులు మిగిల్చే ‘సీ ప్లేన్‌’ ప్రయాణం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ డ్రోన్‌ సదస్సు నిర్వహించడం ద్వారా ప్రపంచ దృష్టిని రాష్ట్రం ఆకర్షించింది. సీ ప్లేన్‌ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా మరోసారి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది.

సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు దాదాపు 150 కిలోమీటర్ల మేర గగనంలో విహారం ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 1,500 అడుగుల ఎత్తులో గగనంలో ఈ బుల్లి విమానం ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు గగనతలం నుంచి 15 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. సీప్లేన్‌లు కూడా అదే స్థాయిలో ఎగిరే సాంకేతికత ఉన్నా, నిర్దేశిత ఎత్తులో ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు ప్రకృతి అందాలను గగనం నుంచి చూసే అనుభూతి కల్పించాలన్నదే దీని ప్రత్యేకత. ఈ ప్రయాణానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) నుంచి అవసరమైన అనుమతులను అధికారులు తీసుకున్నారు.

ప్రత్యేకంగా నీటిలో తేలియాడే జెట్టీలు: ప్రయాణానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్‌ కోసం 10 నిమిషాలు పోను, 20 నిమిషాలు గగనంలో విహరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నదీ ప్రవాహం వెళ్లే ప్రదేశానికి అనుగుణంగా కాకుండా, పున్నమి ఘాట్‌ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్‌ను అధికారులు ఎంపిక చేశారు. ప్లేన్‌లు గాల్లోకి లేవడం మొదలు నిర్దేశిత ప్రదేశం చేరుకున్న తర్వాత కిందికి దిగడం ప్రక్రియ మొత్తం నీటిలోనే ఉండటం దీని ప్రత్యేకత. సాధారణంగా విమానాలకు మాదిరే ప్రత్యేకంగా రన్‌వే అవసరం లేదు. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు. జెట్టి నుంచి ర్యాంపు ద్వారా సీ ప్లేన్‌లోకి ఎక్కేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

విజయవాడలో సీప్లేన్‌- పర్యటకులకు ఇక పండగే - SEAPLANE in vijayawada

కేంద్రం రీజనల్‌ కనెక్టివిటీ స్కీం(ఆర్‌సీఎస్‌) కింద వాటర్‌ ఏరో డ్రోమ్‌లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అనుగుణంగా సీ ప్లేన్‌ సేవలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఉడాన్‌ పథకంలో కేంద్రం అందించే సదుపాయాలను సీ ప్లేన్‌ రంగానికి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది. దేశంలో నీటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో సీ ప్లేన్‌ సేవలను అందుబాటులోకి తేవాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజిని తొలిప్రయోగ కేంద్రంగా ఎంపిక చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో సముద్రతీరాల వెంబడి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేక ప్రయాణ అనుభవాలను ప్రజలకు అందించేందుకు మరో ఏడు ప్రాంతాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

త్వరలోనే ఈ ఏడు ప్రాంతాలకు సర్వీసులు: ఇందులో భాగంగా అరకు, లంబసింగి, రుషికొండ, కాకినాడ, కోనసీమ, తిరుపతి, శ్రీశైలం ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత సీ ప్లేన్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఛార్జీల కింద ఎంత మొత్తం వసూలు చేయాలి? రోజుకు ఎన్నిసార్లు నడపాలి? అనే వివరాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. టెండరు ప్రక్రియ ద్వారా గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ట్రయల్ విజయవంతం: సీ ప్లేన్ విధానం ద్వారా మారుమూల, పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచడానికి విమానయాన రంగాన్ని విస్తరించవచ్చు. రన్‌వే అందుబాటులో లేని ప్రాంతాలకు ఎయిర్‌ కనెక్టివిటి మెరుగుపరచే వీలుంది. విమానాశ్రయాల కంటే తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో వాటర్‌ ఏరోడ్రోమ్‌ల అభివృద్ధి చేసుకోవచ్చు. పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం జరిపిన ముందస్తు ప్రయోగాత్మక పరిశీలన విజయవంతం కావడంతో, శనివారం సీఎం ప్రయాణానికి మార్గం సుగమమైంది. ఈ సీప్లేన్‌ కెనెడా నుంచి తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు అధికారులు, పరిశ్రమలు, మౌలిక వసతులు శాఖ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు.

మొత్తం 14 మంది కూర్చొనే విధంగా సీటింగ్‌ : సీఎం పర్యటన దృష్ట్యా విజయవాడ పున్నమిఘాట్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది కూర్చొనే విధంగా సీటింగ్‌ ఉంది. నీటిలోనే టేకాఫ్, టేకాన్‌కు 120 మీటర్ల వెడల్పుతో 1.16 కిలోమీటర్ల దూరం వరకు జలాశయం ఉండాల్సి ఉంటుంది. ఇందుకనుగుణంగా విజయవాడలో ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్‌ వద్ద, శ్రీశైలం వద్ద డ్యామ్‌ దిగువున పాతాళగంగ వద్ద టేకాఫ్, టేకాన్‌కు ప్రత్యేక జెట్టీలు ఏర్పాటు చేశారు. పున్నమిఘాట్‌ వద్ద ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 10.45కు సీఎం చంద్రబాబు పున్నమిఘాట్‌కు చేరుకుంటారు. 12 గంటలకు సీప్లేన్‌లో ప్రయాణం ప్రారంభించి 12.45కు లోయర్‌ స్టేషన్‌ శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు. తిరిగి 2.20గంటలకు సీప్లేన్‌లో బయలు దేరి మధ్యాహ్నం 3.10గంటలకు పున్నమిఘాట్‌కు చేరుకుంటారు.

'విజయవాడ టు శ్రీశైలం' - రిజర్వాయర్​లో సురక్షితంగా దిగిన విమానం

ABOUT THE AUTHOR

...view details