Schools Reopen in Telangana 2024 :బుధవారం నుంచి పాఠశాలలు మొదలుకానున్న నేపథ్యలం హైదరాబాద్లోని సికింద్రాబాద్, కోఠి, బేగంబజార్ మార్కెట్లలో రద్దీ నెలకొంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంతో విద్యార్థులకు కావాల్సిన వాటి కోసం ఈ మార్కెట్ల బాట పడుతుంటారు. పుస్తక దుకాణాలతో పాటు స్టేషనరీ, బ్యాగులు, బూట్లు, దుస్తుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి నగర వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కు వస్తుంటారు.
వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాఠశాల యాజమాన్యం పిల్లలకు కావాల్సివ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పూర్తి లిస్ట్ ఇస్తుంటారు. వీటితో పాటు పిల్లలకు కావాల్సిన స్టేషనరీ, స్కూల్ బ్యాగులు, బూట్లు, మంచినీటి సీసాలు, లంచ్ బాక్సులు, యూనిఫామ్ మొదలగు వస్తువులను కొనేందుకు వచ్చిన కొనుగోలుదారులతో సోమవారం ఈ ప్రధాన కూడళ్లు కిటకిటలాడాయి. కాగా ఒక్కో మార్కెట్లో కొన్ని వస్తువులకు ఫేమస్, మరి ఏది ఎక్కడ తీసుకుంటే బెటరో తెలుసుకుందాం.
ఏ పుస్తకమైన దొరుకుతుంది :కోఠి మార్కెట్ అనగానే చాలామందికి బట్టలు, పుస్తకాల షాపింగ్ గుర్తొస్తుంటుంది. ముఖ్యంగా ఇక్కడ పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల బుక్స్ లభిస్తాయి. మరొక్క విషయం ఏంటి అంటే ఇక్కడ పాత పుస్తకాలు దొరుకుతాయి. వాటిని సగం ధరకు అమ్ముతారు. అందుకే ఇక్కడ పుస్తకాలు కొనడానికి మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా వస్తుంటారు. నోట్ బుక్స్ విషయానికి వస్తే నాణ్యత, పేజీల సంఖ్యను బట్టి ఇక్కడ పుస్తకాల ధరలు ఉంటాయి. నోట్ బుక్ ఒక్కొక్కటి చొప్పున కాకుండా వాటిని కేజీల వారిగా అమ్ముతారు. అందుకే ఇక్కడ పుస్తకాలు కొనడానికి అధిక సంఖ్యలో పస్తుంటారు. స్కూల్ ప్రాంరంభమవుతే ఈ మార్కెట్ అంతా జనంతో నిండిపోతుంది.