School Bus Owners Neglect Fitness Tests: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బస్సుల ఫిట్‌నెస్ విషయంలో కొన్ని విద్యాసంస్థలు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం వాహనం ఫిట్‌నెస్ చేయకుంటే తిరిగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే వరకు రోజుకు రూ.50లు చొప్పున ఏడాదికి రూ.18 వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయినా విద్యాసంస్థల్లో చలనం కనిపించట్లేదు. విద్యార్థులను సురక్షితంగా చేర్చే బాధ్యత ఆయా సంస్థలదే. దీనికోసం ప్రతి బస్సుకు ఫిట్‌నెస్ టెస్టులు చేయించాలి. ఈ పరీక్షల ధ్రువీకరణ పత్రం లేకుండా రోడ్డెక్కితే బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
School BUS Fitness Tests in Peddapalli: బస్సులో ఏర్పాటు చేసిన బోర్డుపై తప్పనిసరిగా దాని వివరాలతో పాటు చోదకుని వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు పాటించట్లేదని తెలుస్తోంది. ప్రతి బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలున్నా, వాటిలో మందులు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా చాలా బస్సులకు ఇండికేటర్లు పగిలిపోయి ఉండటం, అరిగిన టైర్లు, సైడు మిర్రర్లు, ప్రథమ చికిత్స బాక్స్‌లు లేకుండానే దర్శనమిస్తున్నాయి. ఈ వాహనాలు రవాణా శాఖ అధికారుల చేతికి చిక్కితే అంతే సంగతులు అయినా దొరికితేనే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్న చందంగా తయారైంది పరిస్థితి.
బడి బస్సుల్లో భయం.. రిపేర్ చేయించకుండానే రోడ్డెక్కిస్తున్నారు
"నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను ఎట్టి పరిస్థుతుల్లోనూ రోడ్డెక్కనివ్వం. ప్రతి బస్సుకు పార్కింగ్ లైట్లు, బస్సులో ఒక సహాయకుడు ఉండేలా చూస్తాం. ప్రయాణించే విద్యార్థుల చిరునామా, చరవాణి నంబర్ చార్టు రూపంలో ఏర్పాటు చేయాలి. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, పొల్యూషన్, బీమా పత్రాలు, డ్రైవింగ్ లెసెన్స్, ఆర్టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్షల ధ్రువీకరణ పత్రాలు బస్సులో అందుబాటులో ఉంచాలి."-పురుషోత్తం,డిప్యూటి ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కరీంనగర్
School Bus Fitness Test Rules: బస్సులకు సామర్థ్య పరీక్షలో వాహనాలపై విద్యాసంస్థ పేరు, చిరునామా, ఫోన్ నంబరు స్పష్టంగా రాసి ఉండాలని, బస్సు డ్రైవర్ అనుభవజ్ఞుడై ఉండి 60 ఏళ్లకు మించకూడదనే నిబంధన ఉంది. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి, కంటిచూపునకు సంబంధించి రికార్డులు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బస్సుకు ఇరువైపులా అద్దాలు, అత్యవసర ద్వారం, ప్రథమ చికిత్స పెట్టె అందులో సరిపడా మందులు విధిగా ఉండాలని పేర్కొన్నారు. చిన్నపిల్లల బస్సుల్లో 325 సెంటిమీటర్ల పైన మెట్లు ఉండాలని తెలిపారు.