School Bus Plunges Into Pond:ఓ పాఠశాల బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని మందస మండలం ఉమాగిరి వద్ద ఓ స్కూల్ బస్సు బోల్తా పడి ఐదుగురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. బస్సు పడిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు విద్యార్థులను రక్షించారు.
స్కూల్ బస్సు బోల్తా పడిన సమయంలో సుమారు 35 మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. అందులో ఐదుగురు గాయపడగా వాళ్లని హరిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మందస మండల విద్యా శాఖ అధికారి లక్ష్మణరావు తెలిపారు.