Sankranti Festival Travel Precautions : సంక్రాంతి పండుగకు నగరం ఊర్లకు తరలివెళ్తుంది. ఉపాధి, విద్య కోసం నగరాలు, పట్టణాల్లో ఉంటున్న వాళ్లు పండుగకు సొంతూరు వెళ్తున్నారు. రైళ్లు, బస్సులతో పాటు సొంత వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రయాణాలు ఊపందుకున్నాయి. శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింతగా ఉండనుంది.
రహదారులపై పొగ మంచు ఉండటం, రాత్రి ప్రయాణాలు, అతివేగంగా వాహనాలను నడపడం, మద్యం సేవించి నడపడం వంటివి ప్రమాదాలకు దారి తీస్తాయి. అందువల్ల కారు, బైక్‌ల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ మార్గంలో పంతంగి టోల్ గేట్ దగ్గర సగటున రోజూ 30 నుంచి 36 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తే, సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది.
బండిని ఓసారి చెక్ చేసుకోండి
- చాలా మంది కారు కొని నడపక చాలా వారాల పాటు పార్కింగ్‌లోనే ఉంచుతారు. పండగ ప్రయాణం అనగానే కారు తీసి వెళ్తారు. నెలల తరబడి కారును తీయకపోతే టైర్లు దెబ్బ తింటాయి. ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది.
- 50 వేల కి.మీ తిరిగితే అరిగే టైర్లు, నాలుగైదు నెలలు కదిలించకుండా ఉండే కారు టైర్లు ఒక్కటే. ఊర్లకు వెళ్లే ముందు కారు టైర్ల నాణ్యత, గాలి చూసుకోవాలి. మధ్యలో ఆగితే ఇబ్బంది లేకుండా మంచి స్టెప్నీ ఉంచుకోవాలి.
- పిల్లలు బిస్కెట్లు, చాకెట్లు తిని కారులో వదిలేస్తుంటారు. సెల్లారులో ఎలుకలు, పంది కొక్కులు వాటిని తినేందుకు కారు లోపలికి వస్తాయి. ఇంజిన్‌లో వైర్లను కొరికేస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి.
- దూర ప్రయాణాలు చేసేవారు కారు, ద్విచక్ర వాహనానికి కచ్చితంగా ముందే సర్వీసింగ్ చేయించాలి.
బ్యాటరీ బాగుందా: చలికాలం బ్యాటరీ సమస్యలతో బండి ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇన్‌బిల్ట్ కాకుండా కారులో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న సందర్భాల్లో బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. హైఎండ్ కార్లలో అయితే ఏ సమస్య అయినా ఇండికేటర్ల ద్వారా తెలిసిపోతుంది. పాత కార్లలో అలాంటి సదుపాయాలు ఉండవు. ఊరికి వెళ్లేముందు బ్యాటరీని చెక్ చేయించాలి.