Sanitation Problems in Nizamabad District: ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వాహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇందూరు నగరంలోని ప్రధాన కూడళ్లు, పలు కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం దాపురించింది. దీనికి తోడు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు సక్రమంగా వెళ్లక లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఫలితంగా మురుగు నీటిపై దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
చెత్త సేకరణ జరగకపోవడంతో : నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలోనూ ప్రతిరోజు చెత్త సేకరణ తరలింపు జరగపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. ఆదివారంతో పాటు ఇతర రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులకు సెలవులు వస్తుంటాయి. సెలవు రోజుల్లో నగరవాసులు చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఇలా రెండు, మూడ్రోజుల వరకు తరలించకపోవడంతో భారీగా పోగవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెత్త కుళ్లిపోయి దోమలు, ఈగలు ముసిరి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలను వ్యాపింపజేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం అంటూ ఐదు రోజులే అధికారులు హడావిడి చేశారని ఆ తర్వాత పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూతూ మంత్రంగా పనులు :మురుగు నీటి కాల్వలు, మోరీల్లో చెత్తాచెదారం విపరీతంగా పేరుకుపోతుంది. వర్షాలు వస్తే వరద నీరు రోడ్లపైనే చేరుతుందని స్థానికులు అంటున్నారు. రోడ్ల పక్కనే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయని మోరీలు, పరిసరాలు శుభ్రం చేయాలని అధికారులకు సమాచారం అందిస్తేనే వస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పారిశుద్ధ కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి దోమల విజృంభనకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.