Young Man Doing From Siddipet Research on Fishes : తండ్రి చేస్తున్న వృత్తిని చిన్నప్పటి నుంచి గమనించాడీ యువకుడు. అలా మత్స్య సంపదపై ఆసక్తి పెంచుకున్నాడు. దానికి తగ్గ చదువునే ఎంచుకుని వినూత్నంగా ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రభుత్వ విద్యాసంస్థలోనే చదువుకుంటూ మత్స్యశాస్త్రానికి అనుబంధంగా ఇప్పటి వరకు 6 పరిశోధనలు చేశాడు. అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.
ఖమ్మం జిల్లా తీర్ధాల గ్రామానికి చెందిన సాయికుమార్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఫిషరీస్ పూర్తి చేసుకున్నాడు. తండ్రి భూక్యా బాసు వృత్తిరీత్యా జాలరి. దీంతో ఇతడికి చేపలు పట్టడంపై మరింత ఆసక్తి కల్గింది. డిగ్రీ బీజెడ్సీ చదివుతూనే ఖాళీ సమయాల్లో చేపలు, వాటి రకాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపాడు. తనకున్న అమితాసక్తితో 100 రకాల చేప జాతులు వాటి శాస్త్రీయ నామాలు అనర్గళంగా చెప్పే నైపుణ్యాన్ని సాధిచాడు.
డిగ్రీలో మత్స్యరంగంపై పరిశోధనలకు బీజం వేసుకున్నాడు సాయి. ఆ లక్ష్యంతో ఎమ్మెస్సీ ఫిషరీస్ చదివి పరిశోధనలతో దూసుకుపోతున్నాడు. అధ్యాపకులు, తండ్రి సహకారంతో సెలవు రోజుల్లోనూ వివిధ జాతులపై పరిశోధనలు చేశాడు. ఆక్వాటిక్ బయోడైవర్సీటీ, కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్‌లో భాగంగా వివిధ రకాల జాతులకు చెందిన చేపలను సేకరిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు 50 రకాలను కనుగొన్నాడు ఈ యువకుడు.
పరిశోధనతో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు :అంతరించిపోతున్న వివిధ చేప జాతుల రకాలను ప్రధానంగా గుర్తిస్తున్నాడు సాయి. ముఖ్యంగా మల్గు మీను, మెుయ్యి చేప, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా లభించే మగదుమ్మ, మణిపూర్‌కు చెందిన చేప ఓస్ట్రియో బ్రామా బెలగారని వంటి రకాలు ఇతని పరిశోధలో ఉన్నాయి. ముందు తరాల కోసం వీటి నమూనాలను ల్యాబ్‌లో భద్రపరిచినట్లు ఈ యువకుడు చెబుతున్నాడు . ఇలా వినూత్నంగా పరిశోధనలు చేసి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు సాయి.
రాష్ట్రంలో 30 జాతులకు చెందిన చేపలు ఉన్నాయి. అందులో ఒక్క జాతికి చెందినవే 90 వరకు ఉన్నాయి. మిగిలిన ఇతరత్రా జాతులవి. మత్స్యశాస్త్రానికి అనుబంధంగా ఇప్పటి వరకు 6 పరిశోధనలు చేయగా వాటికి సంబంధించిన అంశాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. అంతరించిపోతున్న చేపలు, కృత్రిమంగా చేప పిల్లల ఉత్పత్తి, సమీకృత చేపల పెంపకం వంటి అంశాలపై ఇంకా పరిశోధనలు చేస్తున్నాడు.