Abhaya APP in TG : మహిళా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు అభయ యాప్ దోహదం చేయనుంది. ఆటోల్లో రాకపోకలు సాగించే వారికి పటిష్ట భద్రత కల్పించనుంది. పోలీసు శాఖ ప్రత్యేక చొరవతో సిద్ధిపేట జిల్లాలోని ఆటో యజమానులు/ డ్రైవర్ల సంపూర్ణ సమాచారం సేకరించి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చి స్టిక్కర్లు వేస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో మొత్తం ఆటోలు 2550 ఉండగా, ఇప్పటి వరకు 1450 ఆటోలకు స్టిక్కరింగ్ పూర్తయింది.
స్కాన్‌తో సులువుగా :అభయ యాప్ (మై ఆటో ఈజ్ సేఫ్)పై ఉండే క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే డ్రైవర్ ఫొటో, వివరాలతో పాటు వాహనానికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ యాప్‌లో ఫోన్ నంబరు నమోదు చేసి ట్రేస్ ది లొకేషన్‌ను క్లిక్ చేస్తే పోలీసులు సులువుగా పర్యవేక్షణ చేయనున్నారు. అవసరం మేర అత్యవసర కాల్, ఫిర్యాదు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. దానికి స్పందించిన వెంటనే వాహన లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి చేరిపోతుంది. ఈ కేంద్రం నుంచి పోలీసులు నేరుగా పర్యవేక్షించే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరోవైపు సమీపంలో ఉండే పోలీసులు ఆ వాహనం వద్దకు చేరుకొని సమస్యను ఛేదిస్తారు.
నిజామాబాద్ మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ దాడి - అదే కారణం!
ఎరుపు సంకేతం వచ్చిందంటే :మహిళలు, ఇతర ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు పూర్తిగా తెలుస్తాయి. వాహనంలో ఏదైనా విలువైన వస్తువులు మరిచిపోతే పోలీసులకు ఛేదించడం చాలా సులభంగా మారుతుంది. డ్రైవర్లు ఏదైనా కేసుల్లో నిందితులుగా ఉంటే స్కాన్ చేయగానే ప్రయాణం సురక్షితం కాదంటూ రెడ్ కలర్ సంకేతం వస్తుంది. ఫలితంగా భద్రతతో కూడిన ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. డ్రైవర్ ప్రవర్తన ఆధారంగా వాహనానికి రేటింగ్ కూడా ఇవ్వొచ్చు.