Road Accidents in AP, Karnataka :ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం పాలైన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండల పరిధిలో డ్రైవర్ నిద్రమత్తులో ఆగి ఉన్న సిమెంటు లారీని టెంపో ట్రావెలర్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 11 మంది తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రమాదంలో కర్ణాటకలోని బెంగళూరు శివారు నెలమంగల సమీపంలో ప్రమాదాన్ని తప్పించబోయి కంటెయినర్ వాహనం దురదృష్టవశాత్తు పక్కనే వెళ్తున్న కారుపై పడడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కారుపైకి కంటెయినర్ పల్టీకొట్టి :బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని నెలమంగల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు రక్తపుమడుగులో విలవిల్లాడుతూ కన్నుమూశారు. ఆరు లైన్ల రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాలకు ఓ లారీ అడ్డుగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ సి.కె.బాబా వెల్లడించారు. కంటెయినర్ రోడ్డుపై వెళుతుండగా ఆ లారీ ఓవర్‌టేక్ చేయడంతో రెండు కార్లు, పాఠశాల వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తలెత్తింది.
ఆ లారీ వెనకే వెళుతున్న కంటెయినర్ దాన్ని ఎక్కడ ఢీకొట్టే ప్రమాదం జరగకూడదని కంటెయినర్ డ్రైవర్ వాహన వేగం తగ్గించాడు. దాంతో కంటెయినర్ మెల్లిగా పక్కకు వాలిపోయింది. అదే సమయానికి దాని పక్కన ఓ కారు దూసుకొచ్చింది. భారీ సరుకుతో వెళుతున్న ఆ కంటెయినర్ కింద ఆ కారు పడి నుజ్జునుజ్జై రహదారికి అతుక్కుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్లో ‘ఐఏఎస్‌టీ’ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ సీఈఓ(చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్)- యజమాని చంద్రయాగప్ప గూళ్(48), ఆయన భార్య గౌరాబాయి(42), అదే కుటుంబానికి చెందిన దీక్ష(12), జానా (16), విజయలక్ష్మి (36), ఆర్య (6) మృతిచెందినట్లు ఎస్పీ బాబా తెలిపారు. డ్రైవర్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ నెల 25న క్రిస్మస్ పండుగకు సెలవులు ఉండటం కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి కొత్తగా కొనుక్కున్న కారులో సొంత ఊరైన మహారాష్ట్రలోని జాత్ ప్రాంతానికి వెళ్తూ ఈ ప్రమాదానికి బలైయ్యారు. కంటెయినర్‌ను తొలగించేందుకు పోలీసులు ఏకంగా మూడు క్రేన్‌లను ఉపయోగించాల్సి వచ్చింది. మృతదేహాలను సమీపంలోని నెలమంగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.