Road Accidents Raised In Andhra Pradesh in YSRCP Regime :గత కొన్నేళ్లుగా తరచూ ఒకే ప్రాంతంలో పలు ఘోర ప్రమాదాలు జరిగాయి. అలాంటి 47 ప్రధాన బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు వీటి నివారణకు తక్షణమే 2.87 కోట్ల నిధులు ఇవ్వాలని అడిగినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. కనీసం రోడ్లపై వేసే రంగులకూ నిధులు విదల్చని దుస్థితి. నిధులు, అధికారాలు లేక, రోడ్ సేఫ్టీ కౌన్సిళ్లు నిర్వీర్యమయ్యాయి. ప్రమాదం జరగని, ప్రాణాలు పోని రోజంటూ లేదు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గంటకు ఇద్దరు, రోజుకు 58 మంది, నెలకు 1700. ఏడాదికి సగటున 20 వేలకు పైగానే ప్రమాదాల కారణంగా రోడ్డున పడ్డారు.
దారులు రోజూ నెత్తురోడుతున్నా అడ్డుకట్ట వేయడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నివారణపై కనీస శ్రద్ధ చూపలేదు. వాహనదారులకు భద్రత, భరోసా కల్పించే విధిని విస్మరించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక, పనులు పూర్తికాక రోడ్లు ప్రమాదాలకు నిలయాలయ్యాయి. దీంతో ఇప్పటికీ రోడ్లపై రక్తపాతం కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం రహదారి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు రోడ్ సేఫ్టీ కౌన్సిళ్ల బలోపేతానికి నిర్ణయించారు.
తరచూ ప్రమాదాలు జరిపే ప్రదేశాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తనిఖీలు, జరిమానాల ద్వారా వచ్చే సొమ్ములో 30 శాతాన్ని రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌కు నిధిగా కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. అందుకే ఏటా కనీసం 100 కోట్ల రూపాయలు రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌కు జమ చేయాలని తొలి విడతగా 40 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దీంతో రోడ్ సేప్టీ కౌన్సిల్ ద్వారా త్వరలోనే బ్లాక్ స్పాట్ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.