ACCIDENTS AND MURDERS IN AP: ఏపీలో రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడాయి. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందగా, మరో చోట లారీ కిందపడి దంపతులు సహా చిన్నారి మృతి చెందారు. మరో ప్రాంతంలో ప్రమాదవశాత్తూ పంటకాలువలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అదే విధంగా పలు హత్యలు చోటుచేసుకున్నాయి.
రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి:జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ కొని ముగ్గురు మృతి చెందారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల పరిధిలోని జాతీయరహదారిపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నంద్యాల నుంచి కడప వైపు వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి అటువైపు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ప్రమాదంలో కడప వైపు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, నంద్యాల వైపు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులందరూ నంద్యాలకు చెందినవారిగా తెలుస్తోంది.
ప్రమాదంలో దంపతులు, చిన్నారి మృతి: వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కాశినాయన మండలం చిన్నాయపల్లెకు చెందిన దంపతులు చిన్నారితో కలిసి ద్విచక్ర వాహనంపై పోరుమామిళ్ల నుంచి మైదుకూరు వైపునకు వస్తూ ఉండగా ముందు వెళ్తున్న టిప్పర్‌ని దాటేప్రయత్నంలో కిందపడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి మీది నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
పంటకాలువలో జారిపడి చిన్నారులు మృతి:కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఏలూరు పంట కాలువలో ప్రమాదవశాత్తు జారి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బాపులపాడు మండలం ఏ. సీతారామపురంలో ఘటన చోటుచేసుకుంది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వెళ్లిన రెడ్డి అజయ్(10), అతడి స్నేహితుడు కోలా యశ్వంత్ కృష్ణా(10)లు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డారు. మృతులను స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.