People Unbothered Towards Victims : అక్కడో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. తనయుడి ప్రాణాలు కాపాడుకునేందుకు అతడి తల్లి గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కాస్త సాయం చేయాలని ఆ వైపుగా పోయే ప్రతి ఒక్కరినీ వేడుకున్నారు. చాలా మంది అలా చూసుకుంటూ పక్క నుంచి వెళ్లిపోగా, మరికొందరు మొబైల్లో ఫొటోలు తీస్తూ ఉండిపోయారు.
కుమారుడిని పట్టుకుని రోదిస్తున్న తల్లి గోవిందమ్మ (ETV Bharat) అంతేతప్ప ఒక్కరు కూడా ఆ యువకుడిని హాస్పిటల్‌కు తీసుకెళ్దామన్న ఆలోచన చేయలేదు. తీరా 108 అంబులెన్స్ వాహనం వచ్చే సరికి ఆ యువకుడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలోని వైఎస్సార్ కూడలి- గూడ్స్ షెడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
చూసినా పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్లిపోతున్న జనం (ETV Bharat) ట్రాక్టర్ ఢీకొట్టి తీవ్రగాయాలు :వివరాల్లోకి వెళితే, రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన కె.గంగాధరరావు అనే వ్యక్తి (30) తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్డు వంతెన దగ్గర పని ఉందని దిగాడు. ఈ క్రమంలోనే ఒక్క అడుగు ముందుకు వేసేసరికి ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిన గంగాధరరావును చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగు పరుగున వచ్చి లేపేందుకు ప్రయత్నించారు.
చూసినా పట్టించుకోని జనం :‘రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి, అయ్యా బాబూ రండయ్యా, ఆస్పత్రికి తీసుకెళ్దాం అంటూ బతిమిలాడినప్పటికీ ఎవరూ కనికరించలేదు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి ఉన్నా, సాయం చేయడానికి ఎవరికీ మనసు రాలేదు. కిలోమీటర్ దూరంలోనే మహారాజా గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. 5 నిమిషాల్లోపే వెళ్లగలరు కూడా. కానీ ఎవరూ స్పందించలేదు. చుట్టుపక్కల వారు ఎవరో 108 అంబులెన్సు వాహనానికి ఫోన్ చేశారు. సుమారు 12.45 గంటలకు ప్రమాదం జరగ్గా, అంబులెన్సు అరగంట తర్వాత అంటే 1.15కు వచ్చింది. అప్పటికే ఆ యువకుడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించామని, తల్లి గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. ఆమె ఇద్దరు కుమారుల్లో గంగాధరరావు చిన్నవాడు. రైల్వేస్టేషన్ సమీపంలో చిన్న పాన్‌షాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Inhuman Incident in kamareddy : కాసుల కోసం కూతుళ్ల కక్కుర్తి.. ఏ కన్నతల్లికి రాకూడదీ దుస్థితి
పెట్రోల్ పోస్తుండగా నిప్పంటించిన ఆకతాయిలు - ఆ తరువాత ఏమైందంటే?