Road Accident in Nandyal District Today :ఆ ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా వాడిపోలేదు. పెళ్లి పారాణియే పూర్తిగా ఆరలేదు. వివాహ వేడుకలో బంధువులంతా ఆనందంగా గడిపిన క్షణాలు కళ్లముందే కదులుతున్నాయి. ఇంతలోనే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివాహం జరిగి వారం గడవకముందే ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కోటి ఆశలతో ఒక్కటైనా నవదంపతులు సహా అబ్బాయి తల్లిదండ్రులు, డ్రైవర్ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయారు.
Allagadda Road Accident Today :ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాణాలొదిలారు. హైదరాబాద్ శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన మంత్రి రవికుమార్ లక్ష్మీ దంపతులు సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురంలో నివాసముంటున్నారు. ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు బాలకిరణ్ స్వీడన్ దేశంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే ఫిబ్రవరి 29న తెనాలికి చెందిన కావ్య అనే అమ్మాయితో బాలకిరణ్‌కు విహహమైంది. ఫిబ్రవరి 3న రిసెప్షన్ జరగింది.
పెళ్లితర్వాత జరిగే మిగతా కార్యక్రమాలకు సంబంధించి తెనాలికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుమల దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగుట్ల వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన రవికుమార్, లక్ష్మీ, బాలకిరణ్, కావ్య మృతి చెందారు. వీరితో పాటు డ్రైవర్‌గా వెళ్లిన అశోక్ కూడా ప్రాణాలు విడిచారు.