Man in Nizamabad Living Without Eating Rice since 50 years :సాధారణంగా అందరూ మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, నైట్ మళ్లీ డిన్నర్ అంటూ తింటుంటాం. భారతీయుల ఆహారంలో అయితే అన్నం, రోటీ చాలా ముఖ్యమైనవి. ఇటీవల మారుతున్న జీవనశైలితో జంక్ ఫుడ్ వినియోగం కూడా చాలా పెరిగింది. మూడు పూటలు తింటేనే బలంగా, ఆరోగ్యంగా ఉంటామని అన్నం తింటారు కొందరు. మరికొందరు ఉదయం అల్పాహారం చేసి, మధ్యాహ్నం అన్నం, రాత్రికి రోటీ లేదా చపాతీ తింటారు. ఇలా రకరకాలుగా ఫుడ్ డైట్ ప్లాన్ చేసుకుంటూ కనీసం ఒక్కపూట అయినా అన్నం తింటారు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం 50 ఏళ్లుగా అన్నం లేకుండా కేవలం పండ్లు, పాలు, నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజమేనండి.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ లొక్కిడి గంగారాం (72) 50 ఏళ్లుగా ఇవేవీ ఎరగకుండానే జీవిస్తున్నారు. 1971లో అజీర్తి సమస్య వల్ల అన్నం మానేశారు. దీంతో అప్పటి నుంచి నీళ్లు, పళ్లు, పాలు, అప్పుడప్పుడు పల్లీలతోనే కడుపు నింపుకొంటున్నారు. 1972లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన ఆయన, 2004లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. తరువాత నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలోని మనోహరాబాద్ గ్రామ శివారులో ఓ ఎకరం స్థలం కొని పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.