Classroom Arrangement for Students :భవనం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఈనాడు-ఈటీవీ భారత్ బుధవారం ప్రచురించిన ప్రత్యేక కథనం అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. విద్యార్థులు చదువుకునేందుకు శాశ్వత భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించింది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దుబ్బగూడలో కొనసాగుతున్న దాజీనగర్ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై "బడి షెడ్డులో సగం- గుడిలో సగం" శీర్షిక ‘ఈనాడు - ఈటీవీ భారత్‌లో ప్రచురితమైంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే.
షెడ్డు నుంచి భవనంలోకి విద్యార్థులు :సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం గురువారం వరంగల్ నుంచి వచ్చిన పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డితోపాటు ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వినోద్‌కుమార్, డీఈవో ప్రణీత, ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు సమీపంలో ఉన్న ఓ అద్దె భవనంలోకి పిల్లలను తరలించారు. 3 గదులతో పాటు తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు ఉండటంతో విద్యార్థులు అందులోకి ఆనందంగా వెళ్లారు. శాశ్వత భవన నిర్మాణంతో పాటు, నెలవారీ అద్దె నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు వివరించారు.
ఇదీ జరిగింది : ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలంలోని దుబ్బగూడలో పాఠశాల లేక తడికల షెడ్డులో సగం, దేవుని ఆలయంలో సగం విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడి ప్రైమరీ పాఠశాల గతంలో ఓ అద్దె ఇంట్లో నడిచేది. అప్పుడు 38 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇంటి ఓనర్ ఖాళీ చేయించారు. ఎక్కడా అద్దె భవనాలు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే చందాల రూపంలో కొంత డబ్బులు వేసుకుని తడికలు, రేకులతో షెడ్డును ఏర్పాటు చేశారు.