Mahbubnagar 4 villages people Decided to Boycott Elections :రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించేందుకు మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. కాలుష్యం వెదజల్లే అమర రాజా ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న నాలుగు గ్రామాలకు చెందిన భూముల్లో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని గతంలో భూసేకరణ చేపట్టి ఇప్పుడు కాలుష్యం వెదజల్లే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు స్వపక్షంలోకి వచ్చాక అనుమతులు వచ్చాయని ఇప్పుడేం చేయలేమని దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
4 Villages People Decided To Boycott Elections :భారీగా ఖర్చులు పెట్టుకుని కంపెనీపై పోరాటం చేసేందుకు తమకు అంత శక్తి లేదని నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు తెలిపారు. రెక్కాడితే డొక్కాడని బతుకులు ఇక్కడి ప్రజలవని అన్నారు. కాలుష్య పరిశ్రమల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా గత 50 రోజుల నుంచి నిరసన దీక్షలు చేపట్టినా స్పందన కరవైందన్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకుపోయేందుకే ఎన్నికలను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.